యశ్వంత్ సిన్హా కొత్త పార్టీ?

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది.

Update: 2024-08-26 14:23 GMT

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ పార్టీని ప్రారంభిస్తారని యశ్వంత్ సిన్హా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం హాజరీబాగ్ లోని అటల్ సేవా కేంద్రంలో తన మద్దతుదారులతో జరిగిన సమావేశంలో.. తను కొత్త పార్టీ పెట్టాలనే ప్రతిపాదనలో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే సోమవారం ఢిల్లీకి వెళ్లేముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ.. తాను ఏర్పాటు చేయబోయే "అటల్ విచార్ మంచ్" పార్టీపై వివిధ వర్గాల ప్రజలతో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని అన్నారు. దివంగత నేత అటల్ బీహార్ వాజ్ పేయి సిద్దాంతలకు కట్టుబడి ఉండేలా తన పార్టీ ఉండబోతుందని, అందుకే పార్టీకి ఆయన పేరును పెట్టినట్టు వివరించారు. వాజ్ పేయి ప్రభుత్వంలో యశ్వంత్ సిన్హా క్యాబినెట్ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా పని చేశారు.

కాగా యశ్వంత్ సిన్హా కొత్త పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో ఆయన మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేశారు. జార్ఖండ్ లోని అన్ని పార్టీలకు అటల్ విచార్ మంచ్ ప్రత్యామ్నాయ పార్టీగా ఉండబోతోందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తన కుమారుల రాజకీయ భవిష్యత్తుకు బీజేపీ అంతగా సహకరించక పోవడం వల్లే యశ్వంత్ సొంత పార్టీ పెట్టనున్నారు అనే రాజకీయ చర్చ కూడా నడుస్తోంది.      


Similar News