ఎన్నికల వేళ బీజేపీ బేరసారాలు ఆడుతోంది: కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ విమర్శలు
మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే కమలేష్ షా, ఛింద్వారా మేయర్ విక్రమ్ అహకేతో సహా తన సన్నిహితులు బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే కమలేష్ షా, ఛింద్వారా మేయర్ విక్రమ్ అహకేతో సహా తన సన్నిహితులు బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అబద్దాలతో మోసం చేస్తుందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ డబ్బు ఆశ చూపుతోందని..అంతేగాక అధికారాన్ని దుర్వినియోగం చేసి బెదిరింపులకు గురి చేస్తున్నదని మండిపడ్డారు. ప్రతి ఎన్నికలకు ముందు బీజేపీ బేరసారాలు ఆడుతోందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో చింధ్వారా ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్‌ను చూసి బీజేపీ భయపడుతోందని చెప్పారు. కాగా, చింద్వారా జిల్లాలోని అమర్వారా నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కాంగ్రెస్ నాయకుడు కమలేష్ షా తన భార్య మాధవీ షా, జిల్లా పంచాయతీ సభ్యుడు కేసర్ నేతమ్‌తో కలిసి ఇటీవల బీజేపీలో చేరారు. సోమవారం చింద్వారా మేయర్ విక్రమ్ అహాకే కూడా కాషాయ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే కమల్‌నాథ్ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ పరిణామాలపై బీజేపీ నేత కైలాష్ వర్గీయ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రజలు కాంగ్రెస్ నుంచి స్వేచ్ఛను కోరుకుంటున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో కమలం వికసించడం ఖాయమన్నారు. కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. బీజేపీలో చేరేందుకు మరికొంత మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.