Mallikarjun Kharge: బీజేపీ ఉగ్రవాదుల పార్టీ.. మోడీ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్

కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన అర్బన్ నక్సలైట్ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-10-12 08:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ పార్టీ ఉగ్రవాదుల పార్టీ అని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సల్స్ వెనుకుండి నడిపిస్తున్నారంటూ ఇటీవల మోడీ చేసిన వ్యాఖ్యలపై శనివారం ఖర్గే స్పందించారు. కల్బుర్గిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. “మోడీ ఎప్పుడూ కాంగ్రెస్‌ను అర్బన్ నక్సల్ పార్టీగా ముద్ర వేస్తారు.. అభ్యుదయవాదులను అర్బన్ నక్సల్స్ అని పిలవడం ఆయనకు అలవాటే. అయితే ఆయన సొంత పార్టీ సంగతేంటి? బీజేపీ ఉగ్రవాదుల పార్టీ, ఆ పార్టీ నేతలకు అనేక మంది హత్యలతో సంబంధం ఉంది. ఇలాంటి ఆరోపణలు చేసే హక్కు మోదీకి లేదు' అని ఫైర్ అయ్యారు. బీజేపీ అధికారంలో ఉన్న చోట్ల ఆపార్టీ నేతలు ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలపై హింసకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు.

హర్యానాలో ఏం జరిగినా.. ఆ ఘటనకు సంబంధించి సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో పార్టీ నివేదిక రాగానే ఏం చేయాలో, ఎలా జరిగిందో తెలుస్తుందన్నారు. దేశ ప్రజలతో పాటు బీజేపీ కూడా హర్యానాలో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని భావించింది. కానీ కాంగ్రెస్‌ ఓడిపోయేలా చేసిన అంశాలు ఏంటి? అనేది చర్చిస్తామన్నారు. విజయం సాధిస్తే ఆ క్రెడిట్ ను అనేక మంది కొట్టేయాలని చూస్తారు. కానీ ఓటమిని మాత్రం అనేక మంది విమర్శిస్తారన్నారు.


Similar News