బీజేపీ హిందువులు, ముస్లింల మధ్య తారతమ్యం చూపదు: రాజ్‌నాథ్ సింగ్
తాము హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, యూదుల ఎవరీ మధ్య వివక్ష చూపడంలేదు
దిశ, నేషనల్ బ్యూరో: మహిళల గౌరవానికి తమకెంతో ముఖ్యమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ నిషేధాన్ని ప్రస్తావించిన మంత్రి, బీజేపీకి హిందువులు, ముస్లింల మధ్య తారతమ్యం లేదన్నారు. గురువారం మధ్యప్రదేశ్‌లోని రేవా లోక్‌సభ స్థానానికి పోటీలో ఉన్న పార్టీ ఎంపీ జనార్దన్ మిశ్రాకు మద్దతుగా జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్.. 'బీజేపీ ఎప్పుడూ హిందువులు, ముస్లింల వ్యవహారాన్నే పట్టించుకుంటుందని అంటున్నారు. కానీ తాము హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, యూదుల ఎవరీ మధ్య వివక్ష చూపడంలేదు. తమ పార్టీ అందరినీ కలుపుకుంటుందని' అన్నారు. భారత్‌లో పుట్టిన వారంతా భారత మాత బిడ్డలని నమ్ముతాము. ట్రిపుల్ తలాక్‌ను నిషేధించిన అంశంలో బీజేపీపై పెరిగిన ఆరోపణల నేపథ్యంలో ప్రజలను మోసగించి నిర్ణయం తీసుకోలేదు. అది మా సంకల్పం, మేమిచ్చిన మాట. ఏ వర్గం వారైనా సరే, బీజేపీ దేశంలోని మహిళలందరినీ సమానంగా చూస్తుంది. మహిళలను గౌరవించడం పురాతన ఆచారం. అందుకు బీజేపీ కట్టుబడి ఉంది. పెళ్లి చేసుకున్న తర్వాత తలాక్, తలాక్, తలాక్ అని వదిలేస్తే అందుకు బీజేపీ సహించదు. ఈ గడ్డపై మహిళలను అగౌరవపరచడాన్ని అనుమతించమని రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఒక దేశం, ఒకే ఎన్నికలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన గురించి ప్రశంసించారు.