Muslims : ఇండియా కూటమికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధం.. మహారాష్ట్ర మజ్లిస్ చీఫ్ ప్రకటన
దిశ, నేషనల్ బ్యూరో : ముస్లింలంతా ఇండియా కూటమికి ఓట్లు వేయబట్టే ‘400 పార్’ లక్ష్యాన్ని బీజేపీ సాధించలేకపోయిందని మజ్లిస్ పార్టీ మహారాష్ట్ర చీఫ్ ఇంతియాజ్ జలీల్ పేర్కొన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : ముస్లింలంతా ఇండియా కూటమికి ఓట్లు వేయబట్టే ‘400 పార్’ లక్ష్యాన్ని బీజేపీ సాధించలేకపోయిందని మజ్లిస్ పార్టీ మహారాష్ట్ర చీఫ్ ఇంతియాజ్ జలీల్ పేర్కొన్నారు. బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమితో చేతులు కలిపేందుకు మజ్లిస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ‘‘మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి మంచి సీట్లు వస్తాయని కూటమిలోని పార్టీల నేతలు చెప్పుకుంటున్నారు. జరగబోయేవి లోక్‌సభ ఎన్నికలు కావు అనే విషయాన్ని వాళ్లు మర్చిపోతున్నారు. అసెంబ్లీ పోల్స్‌లో స్థానిక సమస్యల ప్రాతిపదికన ఓటింగ్ జరుగుతుందనేది గుర్తుంచుకోవాలి’’ అని ఇంతియాజ్ జలీల్ చెప్పారు.
‘‘మహారాష్ట్రలో ముస్లింలు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి ఓట్లు వేశారు. అయితే కొల్హాపూర్ లాంటి ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో ముస్లిం లోక్‌సభ అభ్యర్థులను గెలిపించలేకపోయారు. మహారాష్ట్రలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఒక్కచోట కూడా ముస్లిం అభ్యర్థిని గెలిపించలేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘లోక్‌సభలోకి వక్ఫ్ బిల్లు రాగానే శివసేన (ఉద్ధవ్) అక్కడి నుంచి బిచాణా ఎత్తేయడాన్ని అందరూ చూశారు’’ అని ఇంతియాజ్ జలీల్ పేర్కొన్నారు.