Bjp: వక్ఫ్ బిల్లు ఆమోదంతో బీజేపీ డామినెన్స్.. ఆ పార్టీలే టార్గెట్‌గా వ్యూహాలు !

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన వక్ఫ్ బిల్లు సహా పలు ఇతర బిల్లులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Update: 2025-04-05 17:58 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంట్ (Parliament) బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన వక్ఫ్ బిల్లు (Waqf bill) సహా పలు ఇతర బిల్లులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సమావేశాల ముగింపునకు ముందు తీవ్ర చర్చకు దారి తీసిన వక్ఫ్ సవరణ బిల్లు-2025కు ఉభయసభలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ బిల్లుకు లోక్ సభలో 288 మంది ఎంపీలు అనుకూలంగా, 232 మంది వ్యతిరేకంగా ఓటేశారు. అలాగే రాజ్యసభలో 128 మంది అనుకూలంగా, 95 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే ఈ బిల్లు కలిగే ప్రయోజనాలు పక్కన పెడితే పార్లమెంటులో బిల్లుకు గణనీయమైన మద్దతు లభించడంతో బీజేపీ రాజకీయ ఆధిపత్యం మళ్లీ బలపడినట్టు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఎంతో కీలకమైన బిల్లును ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆమోదించింది. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నప్పటికీ ప్రక్రియను సాఫీగా సాగించి తన మార్కును కనబర్చింది. దీంతో బీజేపీ తన ఆధిపత్యాన్ని తిరిగి తెచ్చుకుంది.

కాషాయం వైపే బీజేపీ వ్యతిరేకులు సైతం!

ఎన్డీఏ మిత్ర పక్షాలను సైతం బీజేపీ ఏకతాటిపైకి తెచ్చి విజయం సాధించింది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ)లు వక్ఫ్ బిల్లుకు మద్దతిచ్చాయి. ఆయా పార్టీల ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. పాలక ఎన్డీఏలోని బీజేపీ మిత్రదేశాలు బలంగా తమ వైపు తిరిగి ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఆశ్చర్యకరంగా బీజేపీ వ్యతిరేకులుగా తమను తాము చిత్రీకరించుకున్న ఒడిశాలోని బిజు జనతాదళ్ (బీజేడీ), వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రాజ్యసభలో బిల్లుపై ఓటు వేయడానికి తమ ఎంపీలకు ఎటువంటి విప్ జారీ చేయలేదు. ఈ రెండు పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో బీజేపీ కారణంగానే ఎదురుదెబ్బలు తిన్నాయి. అయినప్పటికీ బిల్లును వ్యతిరేకిస్తూ ఎటువంటి ప్రకటనలు, తమ ఎంపీలకు ఆదేశాలు జారీ చేయకపోవడం గమనార్హం.

2024లో భిన్నమైన పరిస్థితులు

లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన మొదటి పార్లమెంటు సమావేశంలోనే 2024 ఆగస్టులో ప్రభుత్వం మొదటిసారి వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టింది. అయితే అప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రతిపక్షాలు అభ్యంతరం తెలపడంతో బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపించారు. బీజేపీ మిత్రపక్షాలు జేడీయూ, టీడీపీ, లోక్ జనశక్తి (ఎల్ జేపీ) పార్టీలు కూడా బీజేపీపై ఒత్తిడి తీసుకొచ్చాయని అందుకే బిల్లును జేపీసీకి పంపించారని తెలుస్తోంది. కానీ బిల్లు తుది మెరుగులు దిద్దే సమయంలో ఇవే పార్టీలు బీజేపీకి సంపూర్ణ మద్దతు తెలిపాయి. బిల్లు ప్రవేశపెట్టడానికన్నా ముందు పలు సవరణలకు పట్టుబట్టినప్పటికీ సభలో మాత్రం వ్యతిరేకించలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆయా పార్టీలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా బీజేపీ ఎజెండాలో చేరాయి. ఈ మూడు పార్టీలు బలంగా ఉంటే బీజేపీ మరిన్ని కఠిన నిర్ణయాలు సైతం తీసుకునే చాన్స్ ఉంది.

సంకీర్ణంపై తొలగిన సందేహాలు

పార్లమెంటరీ వివాదంలో ఎప్పుడు, ఎవరు యోధులు అవుతారో చెప్పలేము. కానీ బడ్జెట్ సమావేశాల రెండో భాగం అంతా బీజేపీ తన పట్టును నిలుపుకుంది. 2024కి ముందు బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది. తాజా పార్లమెంటు ఎన్నికల్లో కాస్త మెజారిటీ తగ్గి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. టీడీపీ, జేడీయూ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండబోదని, ప్రభుత్వం మైనారిటీలో ఉంది, భాగస్వామ్యపక్షాల మధ్య ఐక్యత కొరవడిందని పలు కథనాలు వెలువడ్డాయి. నితీశ్ సైతం ఎన్డీఏను వీడబోతున్నారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే తాజా పరిణామాలతో అవన్నీ పటాపంచలయ్యాయి. సంకీర్ణం పూర్తి ధృడంగా ఉందని మరోసారి నిరూపితమైంది. 2024కి ముందున్న మెజారిటీ మార్క్ మరోసారి బీజేపీ కనబర్చిందని స్పష్టమైంది.

మిత్రపక్షాల ఐక్యతకు కారణమిదే?

బీజేపీ తన మిత్రపక్షాలైన జేడీయూ, టీడీపీల సలహా మేరకు వక్ఫ్ బిల్లును జేపీసీకి పంపాలని నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఈ పార్టీల అభిప్రాయాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారనే సందేశాన్ని పంపింది. అనంతరం బిల్లు ఫైనల్ అయ్యే ముందు ఈ రెండు పార్టీలు ప్రతిపాదించిన సవరణలకు కూడా అంగీకరించింది. మిత్రక్షాల మాటలను పరిగణనలోకి తీసుకుంటున్నామని నిరూపించింది. అంతేగాక ఈ బిల్లు ముస్లింలకు అనుకూలంగా ఉందని ఆయా పార్టీల్లోని ముస్లింలను తమ అధినేతలతోనే అభిప్రాయానికి తీసుకురాగలిగింది. దీంతో మిత్రపక్షాలు బీజేపీ వెంటే నడిచాయి. 

Tags:    

Similar News