Bihar assembly: పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే పదేళ్ల జైలు శిక్ష..బిల్లుకు బిహార్ అసెంబ్లీ ఆమోదం

నీట్ యూజీ పేపర్ లీక్ అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అంతేగాక పలు పరీక్షల ప్రశ్నపత్రాలు సైతం లీకైన ఘటనలు సైతం ఇటీవల వెలుగు చూశాయి.

Update: 2024-07-24 11:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నీట్ యూజీ పేపర్ లీక్ అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అంతేగాక పలు పరీక్షల ప్రశ్నపత్రాలు సైతం లీకైన ఘటనలు సైతం ఇటీవల వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోటీ పరీక్షల్లో అవకతవకలను అరికట్టేందుకు బిహార్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్ ఫేర్‌మీన్స్)-2024 పేరుతో బిల్లు తీసుకొచ్చింది. దీని ప్రకారం..పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే 3 నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు, రూ. కోటి జరిమానా విధించే అవకాశం ఉంది.

అంతేగాక దోషులుగా తేలిన వారి ఆస్తులను అటాచ్ చేయడానికి, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడి అరెస్టైన వ్యక్తులు బెయిల్ పొందడం కూడా కష్టతరం కానుంది. ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ బుధవారం సభలో ప్రవేశపెట్టగా.. మూజువాణి ఓటుతో సభ ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదం తర్వాత ఈ బిల్లు అమల్లోకి రానుంది. మరోవైపు బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. విపక్షాల ఆందోళన మధ్యే బిల్లును ఆమోదించింది. ఈ బిల్లును అంతకుముందే సభలో ప్రవేశపెట్టాల్సి ఉండగా, విపక్షాల ఆందోళన కారణంగా ప్రభుత్వం దానిని వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమోదించింది.  

Tags:    

Similar News