అయోధ్య రామమందిరం పేరిట క్యూఆర్ కోడ్ స్కామ్.. అక్రమంగా విరాళాల సేకరణ
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరంలో జనవరి 22న శ్రీరాముడి ప్రతిష్ఠాపనోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతోంది.
దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరంలో జనవరి 22న శ్రీరాముడి ప్రతిష్ఠాపనోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతోంది.కొందరు సైబర్ నేరగాళ్లు దీన్ని కూడా అదునుగా తీసుకున్నారు. అయోధ్య రామమందిరానికి విరాళాలు ఇవ్వాలని కోరుతూ సోషల్ మీడియాలో సందేశాలను వ్యాపింపచేస్తున్నారు. ఈ ఫేక్ మెసేజ్‌లలో క్యూఆర్ కోడ్‌ను కూడా జతపరుస్తున్నారు. ఆ క్యూఆర్ కోడ్‌లను పొరపాటును ఎవరైనా స్కాన్ చేసి డబ్బులు పంపితే.. అవి సైబర్ కేటుగాళ్ల అకౌంట్లలో జమ అవుతాయి. ఇలాంటి వాళ్ల బారినపడి మోసపోవద్దని రామభక్తులకు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సూచించింది. ఈవిషయంపై తాము ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ చెప్పారు. అయోధ్య రామమందిరం తరఫున విరాళాలను సేకరించే అధికారాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మరెవరికీ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. ఈమేరకు వినోద్ బన్సాల్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.