కాంగ్రెస్‌కు భారీ షాక్: నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ అభ్యర్థి
లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన అక్షయ్ బామ్ సోమవారం తన నామినేషన్ ఉప సంహరించుకున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన అక్షయ్ బామ్ సోమవారం తన నామినేషన్ ఉప సంహరించుకున్నారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ మెండోలా, మంత్రి కైలాష్ విజయవర్గీయలతో కలిసి రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లిన ఆయన నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో అక్షయ్‌ను ఇండోర్ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ క్రమంలో ప్రచారం సైతం నిర్వహంచిన ఆయన ఎన్నికలకు మరో 14రోజుల టైం ఉండగా నామినేషన్ విత్ డ్రా చేసుకోవడం గమనార్హం.
అయితే అక్షయ్ బామ్ బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. నామినేషన్ విత్ డ్రా అనంతరం ఆయన నేరుగా బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. ఈ వ్యవహారంపై మంత్రి కైలాష్ విజయవర్గియ స్పందించారు. ‘ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బామ్‌కు బీజేపీలోకి స్వాగతం’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాగా, గతంలో గుజరాత్‌లోని సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభానీ నామినేషన్‌ను ఈసీ తిరస్కరించడంతో బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.
ఏకగ్రీవానికి బీజేపీ ప్రయత్నం!
సూరత్‌లో నాటకీయ పరిణామాల మధ్య బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. ఈ నేపథ్యంలో ఇండోర్ నియోజకవర్గంలోనూ మరోసారి బీజేపీ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎంపిక చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఇండోర్ బరిలో ఇంకా 21మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో సూరత్‌లో మాదిరిగానే మిగతా క్యాండిడేట్స్‌ని కూడా తమ నామినేషన్‌లను ఉపసంహరించుకునేలా చేసి, మరోసారి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాలని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం. అయితే నామినేషన్‌కు ఈరోజే చివరి రోజు కావడంతో ఉత్కంఠ నెలకొంది.