Bidhuri : ప్రియాంక చెంపల్లాగా రోడ్లు నిర్మిస్తా.. బీజేపీ నేత రమేష్ బిధూరి అభ్యంతరకర వ్యాఖ్యలు
కల్కాజీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరీ ప్రియాంకా గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరీ (Ramesh bidhuri) కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ (Priyanka gandhi) పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంక చెంపల్లాగా చేస్తానని వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రీయ జనతాదళ్ (RJD) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu prasad yadav) బిహార్ రోడ్లను హేమమాలిని చెంపల్లా నున్నగా చేస్తానని చెప్పారు. కానీ ఆయన ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదు. కానీ ఓఖ్లా, సంగమ్ విహార్ రోడ్లను ఎలా తయారు చేశానో, అలాగే కల్కాజీలోని అన్ని రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా మారుస్తా’ అని అన్నారు. రహదారులన్నింటినీ సున్నితంగా చేస్తానని తెలిపారు.
ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని కలిగి ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే (Supriya stinaate) విమర్శించారు. బిదూరీ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని అభివర్ణించారు. సీనియర్ నేత పవన్ ఖేడా సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బిధూరీ వ్యాఖ్యలు బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ విలువలను ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బిధురి వ్యాఖ్యలను ఖండించింది. మహిళల పట్ల బీజేపీకి ఉన్న ఉన్న గౌరవం ఇదేనా అని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ప్రశ్నించారు.