అమెరికా ఉపాధ్యక్షుడు ట్రంప్.. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ పుతిన్..!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మానసిక పరిస్థితిపై మరోసారి చర్చ జరుగుతోంది. ‘అమెరికా ఉపాధ్యక్షుడు ట్రంప్‌’, ‘ఉక్రెయిన్‌ అధ్యక్షుడు పుతిన్‌’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Update: 2024-07-12 04:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మానసిక పరిస్థితిపై మరోసారి చర్చ జరుగుతోంది. ‘అమెరికా ఉపాధ్యక్షుడు ట్రంప్‌’, ‘ఉక్రెయిన్‌ అధ్యక్షుడు పుతిన్‌’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నాటో కూటమి దేశాల వార్షిక సదస్సు ముగిసిన తర్వాత బైడెన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు అధ్యక్ష రేసు నుంచి వైదొలగితే ట్రంప్‌ను కమలా హ్యారిస్‌ ఓడించగలరని భావిస్తున్నారా?’’ అని జర్నలిస్టులు ప్రశ్నించారు.‘‘అధ్యక్షుడిగా పనిచేసే అర్హతలు ఉపాధ్యక్షుడు ట్రంప్‌నకు లేకుంటే నేను ఆయన్ని బరిలోకి దింపేవాన్ని కాదు’’ అని బదులిచ్చారు.ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అనకుండా ట్రంప్ అని పొరపాటున అనేశారు. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆయన్ని అధ్యక్ష పదవి రేసు నుంచి తొలగించాలని సొంత పార్టీ నేతలే అంటున్నారు.

జెలెన్ స్కీని కొనియాడిన బైడెన్

ఇకపోతే, ప్రెస్ మీట్ కి ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని నాటో కూటమి దేశాల ప్రతినిధులకు పరియం చేశారు. ఆయనపై ప్రశంసలు కురింపించి.. ప్రసంగించాలని కోరారు. అయితే జెలెన్ స్కీని వేదికపైకి ఆహ్వానిస్తూ.. అధ్యక్షుడు పుతిన్ అని అన్నారు. దీంతో సదస్సులోని వారంతా అవాక్కయ్యారు. జెలెన్ స్కీ మాత్రం దాన్ని తేలిగ్గా తీసుకున్నారు. కాగా.. నాటో కూటమి దేశాలు మాత్రం బైడెన్ కు మద్దతుగా నిలిచారు. ఇలాంటి పొరపాట్లు సహజమే అని జర్మనీ ఛాన్స్ లర్ ఒలాఫ్ షోల్జ్ అన్నారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌, బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ సైతం బైడెన్‌ యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపారు.

అనుకున్నవన్నీ పూర్తి చేయాలి

ట్రంప్ తో జరిగిన బిగ్ డిబేట్ లో తడబడిన బైడెన్.. ఆ తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ ని ‘బిగ్‌ బాయ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌’గా వైట్ హౌజ్ పేర్కొంది. ఎప్పటిలాగే తాను పోటీకి అర్హుడినని.. రేసులో కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. పదవి కోసం కాదని.. అనుకున్న పనులు పూర్తి చేసేందుకు బరిలో దిగానని పేర్కొన్నారు. ఇప్పటికే, చాలా పనులు పూర్తి చేశానని అన్నారు. గతంలో జరిగిన సంఘటనలను పేర్కొంటూ బైడెన్ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సుదీర్ఘంగా జవాబిచ్చారు. విదేశాంగ విధానంపై సుదీర్ఘంగా మాట్లాడారు. నాటో కూటమి గురించి సదస్సు ప్రారంభంలో మాట్లాడారు. కాకపోతే, ఆయన టెలీ ప్రాంప్టర్లను ఉపయోగించడం గమనార్హం. అది ముగిసిన తర్వాత దాదాపు పది మంది జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు.


Similar News