రాహుల్‌ను ‘రీలాంచ్’ చేసేందుకే భారత్ జోడో న్యాయ్ యాత్ర: బీజేపీ విమర్శలు
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో చేపట్టబోయే భారత్ జోడో న్యాయ్ యాత్రపై బీజేపీ విమర్శలు గుప్పించింది.
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో చేపట్టబోయే భారత్ జోడో న్యాయ్ యాత్రపై బీజేపీ విమర్శలు గుప్పించింది. రాహుల్ గాంధీని ‘రీలాంచ్’ చేసే ప్రయత్నంలో భాగంగానే యాత్ర చేపడుతున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. ‘మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. దీంతో ప్రతి ఒక్కరికీ రాహుల్‌పై నమ్మకం పోయింది. అందుకే మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌లు ఖర్గేను సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించారు. ఈ క్రమంలో మళ్లీ రాహుల్‌ను నిలబెట్టడానికే యాత్ర చేపడుతున్నారు’ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు వాటిని తిప్పికొడతారని.. దేశంలో మోడీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెప్పారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సీట్ల షేరింగ్‌పై ఏకాభిప్రాయం సాధించడంలో ఇండియా కూటమి విఫలమైందని ఆరోపించారు.