Bhagavanth mann: భగవంత్ మాన్‌కు కేంద్రం షాక్..ఒలంపిక్స్‌కు వెళ్లేందుకు అనుమతి నిరాకరణ
ప్యారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లడానికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. భారత హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు భగవంత్ మాన్ ఆదివారం ప్యారిస్‌కు వెళ్లాల్సి ఉంది.
దిశ, నేషనల్ బ్యూరో: ప్యారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లడానికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. భారత హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు భగవంత్ మాన్ ఆదివారం ప్యారిస్‌కు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే తనకు అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరాడు. అయితే జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యురిటీ ఉన్న సీఎంకు ఇంత తక్కువ సమయంలో అంతర్జాతీయంగా భద్రత కల్పించడం సాధ్యం కాదని స్పష్టం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేసినట్టు తెలుస్తోంది.
కాగా, సీనియర్ నేతలకు విదేశాలకు వెళ్లాలంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి పొలిటికల్ క్లియరెన్స్ తప్పనిసరిగా అవసరం. దీంతో సీఎంకు భారీ షాక్ తగిలినట్టు అయింది. ఈ వ్యవహారంపై భగవంత్ మాన్ స్పందించారు. ‘భారత్ 3-2 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించడం చాలా గర్వంగా ఉంది. ఈ ముఖ్యమైన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేయడం ద్వారా జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆయనకు అభినందనలు’ అని పేర్కొన్నారు. ప్లేయర్ల మనో ధైర్యాన్ని పెంచడానికి ఒలంపిక్స్ జరిగే ప్రదేశానికి వెళ్లాలనుకున్నా..కానీ అందుకు అనుమతి రాలేదు అని తెలిపారు.