ఆ 84 సెకన్ల మధ్య అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట.. ముహూర్తం విశిష్టత ఇదే..!
అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్టకు గడువు సమీపిస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఈ మహత్తర ఘట్టం కోసం కోట్ల మంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే శ్రీరాముని ప్రాణ ప్రతిష్టకు తుది ఏర్పా్ట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రముఖులకు ఆహ్వానాలను ట్రస్ట్ నిర్వాహకులు పంపారు. అయితే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు శుభముమూర్తం 84 సెకన్ల పాటు ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 2024 జనవరి 22న ప్రాణ ప్రతిష్ట జరగనుంది. అదే రోజు మద్యాహ్నం 12.29 గంటల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య అత్యంత శుభ గడియలు ఉన్నట్లు వేద పండితులు తెలిపారు.
యూపీ వారణాసికి చెందిన సంగ్వేద విద్యాలయ ఆచార్యులు, జ్యోతిష్యుడు ఆచార్య గణేశ్వర్ శాస్త్రి ఈ మేరకు ముహూర్తం వివరాలను వెల్లడించారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మేష లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో జరగనుంది. సాధారణంగా 5 గ్రహాలు అనుకూల స్థానంలో ఉంటే మంచి ముహూర్తం అని.. అయితే ప్రాణ ప్రతిష్ట సమయంలో ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని గణేశ్వర్ శాస్త్రి తెలిపారు. ఈ సమయంలో విగ్రహ ప్రతిష్టాపన చేస్తే ప్రపంచంలోనే మన దేశ కీర్తి మరింత పెరుగుతుందన్నారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా 12.15 గంటల నుంచి 12.45 గంటల మధ్య ఈ కార్యక్రమం జరగనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
నాగర శైలిలో నిర్మిస్తున్న అయోధ్య రామ మందిరం ఎత్తు దాదాపు 161 అడుగులు ఉండగా.. 360 స్తంభాలు ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణానికి రూ.1400 కోట్ల నుంచి రూ.1800 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అహ్మాదాబాద్ కు చెందిన టెంపుల్ ఆర్కిటెక్ట్స్ సోమ్ పురా ఫ్యామిలీ అయోధ్య రామ మందిర నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తోంది. జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా ప్రతిష్టాపన పక్రియ స్టార్ట్ అయి 10 రోజుల పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.