Bengal Bandh: 12 గంటల పాటు బంద్.. దీదీ సర్కారు వైఖరికి నిరసనగా బీజేపీ ఆందోళన

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా 12 గంటల పాటు రాష్ట్రవ్యాప్త బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది.

Update: 2024-08-28 03:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా 12 గంటల పాటు రాష్ట్రవ్యాప్త బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. కాగా.. బీజేపీ బంద్‌ను పోలీసులు అడ్డుకుంటున్నారు. పలువురు బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో, ఉద్రిక్త పరిస్థితులు కన్పిస్తున్నాయి. బుధవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీజేపీ పిలుపుచ్చిన బంద్‌ నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. సుమారు 5 వేల మంది పోలీసులను సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించారు. 15 మంది సీడీపీ ర్యాంక్‌ పోలీసు అధికారులు ముఖ్య ప్రాంతాలను పర్యవేక్షించనున్నారు. బంద్ లో హింసాత్మక ఘటనలు జరగకుండా ఏసీపీ శాంతిభద్రతలను పర్యవేక్షించనున్నారు. బంద్ ను పరిశీలించేందుకు డ్రోన్లను వాడనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, ఉదయం 6 నుంచే వాహనాల రాకపోకలను బీజేపీ నేతలు నిలిపివేస్తున్నారు.

హింసాత్మకంగా మారిన విద్యార్థుల ర్యాలీ

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనకు నిరసనగా మంగళవారం విద్యార్థులు చేపట్టిన ‘నబన్నా అభియాన్‌ (చలో సచివాలయ ర్యాలీ)’ హింసాత్మకంగా మారింది. ఘటనకు బాధ్యత వహిస్తూ పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఆ ర్యాలీలో పోలీసులు, విద్యార్థులకు మధ్య ఘర్షణ జరిగింది. రాళ్ల దాడి, లాఠీచార్జి, వాటర్ కెనాల్స్ వాడటంతో ఇరువైపులా చాలామంది గాయపడ్డారు. ఇక.. శాంతియుత ర్యాలీపై ఇదెక్కడి అమానుషత్వమంటూ పోలీసులు, సీఎం మమతా ప్రభుత్వంపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. దీంతో, బుధవారం 12 గంటల పాటు బెంగాల్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. దీన్ని అధికార తృణ మూల్‌ కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుబట్టింది. బంద్‌ జరగనిచ్చే ప్రసక్తే లేదని మమత ముఖ్య సలహాదారు ఆలాపన్‌ బంధోపాధ్యాయ్‌ స్పష్ట చేశారు.

టీఎంసీపీ వ్యవస్థాపక దినోత్సవం ఆమెకే అంకింతం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆర్జీ కర్ ట్రైనీ డాక్టర్ కు పార్టీ విద్యార్థి విభాగం వ్యవస్థాపక దినోత్సవాన్ని అంకితం చేశారు. ‘తృణమూల్ ఛత్ర పరిషత్ స్థాపన దినోత్సవాన్ని మా సోదరికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నాం. కొన్ని రోజుల క్రితం ఆర్జీ కర్ హాస్పిటల్‌లో జరిగిన విషాదకరమైన నష్టానికి తీవ్రంగా చింతిస్తున్నాం. చనిపోయిన బాధితురాలి కుటుంబానికి మా హృదయపూర్వక సానుభూతి. ఆమెకు సత్వర న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నాం. అలాగే దేశవ్యాప్తంగా ఇలాంటి అమానవీయ చర్యలకు గురైన బాధితులందరికీ అండగా టీఎంసీ ఉంటుంది’ అని మమతా బెనర్జీ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు.


Similar News