బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీలో చేరాలని తమను బలవంతం చేస్తున్నారని..కానీ ఎన్నటికీ కాషాయ పార్టీకి లొంగిపోయే ప్రసక్తే లేదని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

Update: 2024-02-04 09:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీలో చేరాలని తమను బలవంతం చేస్తున్నారని..కానీ ఎన్నటికీ కాషాయ పార్టీకి లొంగిపోయే ప్రసక్తే లేదని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఆదివారం ఢిల్లీలో రెండు పాఠశాలల భవనాలకు శంకుస్థాపన చేసిన అనంతరం కేజ్రీవాల్ మాట్లాడారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా వాటిని ధీటుగా ఎదుర్కొంటానని తెలిపారు. ‘ఢిల్లీ ప్రభుత్వం ప్రతి ఏటా తన బడ్జెట్‌లో 40 శాతాన్ని పాఠశాలలు, ఆస్పత్రుల కోసం ఖర్చు చేయగా, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జాతీయ బడ్జెట్‌లో 4 శాతం మాత్రమే ఖర్చు చేస్తుందని ఆరోపించారు. తనను జైలుకు పంపినా ఢిల్లీ ప్రభుత్వం చేపడుతున్న పాఠశాలల నిర్మాణం, ప్రజలకు ఉచిత వైద్యం వంటి అభివృద్ధి పనులు ఆగబోవని స్పష్టం చేశారు. స్కూళ్లు కట్టినందుకే మనీశ్ సిసోడియాను జైలులో పెట్టారని, మొహల్లా క్లినిక్‌లు నిర్మించినందుకే సత్యేందర్ జైన్‌లను జైలుకు పంపారని విమర్శించారు.

అతిశీకి క్రైమ్ బ్రాంచ్ నోటీసులు

ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ మంత్రి అతిశీకి ఆదివారం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఉదయం అతిశీ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమె లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. 24గంటల్లోగా దీనిపై స్పందించాలని ఆదేశించారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా శనివారం క్రైమ్ బ్రాంచ్ నోటీసు ఇచ్చింది. ఫిబ్రవరి 5లోగా సమాధానం ఇవ్వాలని తెలిపింది. కాగా, ‘ఢిల్లీలో రెండుసార్లు ఆపరేషన్ కమలం చేసేందుకు బీజేపీ ప్రయత్నించింది. 2013లో ఆప్‌కు 28 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. ఆ తర్వాత పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నింది. ఈసారి బీజేపీ ఆపరేషన్ కమలం 2.0ని ప్రారంభించింది’ అని అని అతిశీ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే దీనిపై ఆధారాలు అందజేయాలని క్రైమ్ బ్రాంచ్ సమన్లు జారీ చేసింది.

Tags:    

Similar News