WhatsApp Status : 'వాట్సాప్ స్టేటస్‌ కూడా సమాచార వ్యాప్తి వ్యవస్థే'

వాట్సాప్‌ స్టేటస్‌ కూడా ఓ రకమైన సమాచార వ్యాప్తి వ్యవస్థే అని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ తెలిపింది.

Update: 2023-07-24 13:43 GMT

బాంబే : వాట్సాప్‌ స్టేటస్‌ కూడా ఓ రకమైన సమాచార వ్యాప్తి వ్యవస్థే అని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ తెలిపింది. ఓ వర్గానికి వ్యతిరేకంగా ద్వేషపూరిత వ్యాఖ్యలతో వాట్సప్‌లో స్టేటస్ పోస్ట్ చేసిన ఒక వ్యక్తిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కొట్టివేసేందుకు నిరాకరించింది. వాట్సప్ స్టేటస్ ఆధారంగా తనపై అట్రాసిటీ కేసును నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ మహారాష్ట్రకు చెందిన కిషోర్ లాండ్కర్ అనే వ్యక్తి వేసిన అప్పీల్ పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ తీర్పును వినిపించింది. ఈ ఏడాది మార్చిలో కిశోర్‌ లాండ్కర్‌ వాట్సాప్‌ స్టేటస్‌లో ఓ ప్రశ్న వేస్తూ.. అందుకు సమాధానాన్ని గూగుల్‌లో వెతకాలని కోరాడు. అందులో ఊహించని నిజాలు తెలుస్తాయని పేర్కొన్నాడు.

అతడు చెప్పిన విధంగానే గూగుల్‌లో వెతికిన ఓ వ్యక్తికి అభ్యంతరకర వీడియోలు కనిపించాయి. అవి కొన్ని వర్గాల ప్రజల మనోభావాలు దెబ్బతీసేవిగా ఉన్నాయని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కిశోర్‌పై కేసులు నమోదయ్యాయి. పరిచయస్తులకు ఏదైనా చెప్పాలని భావించినప్పుడే సాధారణంగా వాట్సాప్ స్టేటస్ పెడుతుంటారని ధర్మాసనం తెలిపింది. నెటిజన్స్ కూడా తమ కాంటాక్ట్‌ల వాట్సాప్ స్టేటస్‌ను తరచుగా చెక్ చేస్తూ ఉంటారని పేర్కొంది. ఈ తరుణంలో వాట్సాప్ స్టేటస్‌ను పౌరులు బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని కోరింది.

Read More : మసీదులో సైంటిఫిక్ సర్వేపై సుప్రీంకోర్టు స్టే..

Tags:    

Similar News