ఢిల్లీలోని బ్రిటన్ హైకమిషన్ కార్యాలయం ముందు బారీకేడ్ల తొలగింపు

లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయం ముందు ఖలిస్తాన్ ఉద్యమకారులు నిరసనకు దిగి జాతీయ జెండాను అవమానించేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వానికి నిరసనగా భారత ప్రభుత్వం చర్యలకు పూనుకొంది.

Update: 2023-03-22 11:32 GMT

దిశ, వెబ్ డెస్క్: లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయం ముందు ఖలిస్తాన్ ఉద్యమకారులు నిరసనకు దిగి జాతీయ జెండాను అవమానించేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వానికి నిరసనగా భారత ప్రభుత్వం చర్యలకు పూనుకొంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని బ్రిటన్ హైకమిషన్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన బారికేడ్లను పోలీసులు తొలగించారు. అయితే ఈ విషయంపై ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ.. బ్రిటన్ హైకమిషన్ ముందు బారికేడ్లు ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ క్రమంలోనే వాటిని తొలగించామని తెలిపారు. ఇక బ్రిటన్ హైకమిషన్ వద్ద ఏర్పాటు చేసిన సెక్యూరిటీ సిబ్బందిని తొలగించలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ విషయంపై మాట్లాడేందుకు బ్రిటన్ హైకమిషన్ అధికారులు నిరాకరించారు. తాము భద్రతా విషయాల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని తెలిపారు.

కాగా ఖలిస్తాన్ ఉద్యమ నేత అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందుకు భారత ప్రభుత్వం గాలింపు చేపట్టిన నేపథ్యంలో ఖలిస్తాన్ మద్దతుదారులు లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయంపై ఏర్పాటు చేసిన భారత జాతీయ జెండాను కిందకు దింపి ఆ స్థానంలో ఖలిస్తాన్ జెండాను పెట్టే ప్రయత్నం చేశారు. అయితే వారి ప్రయత్నాలను అక్కడి భారతీయ అధికారులు అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే భారత   హైకమిషన్ కార్యాలయానికి తగిన భద్రతను కల్పించకపోవడం పట్ల భారత్ ప్రభుత్వం బ్రిటన్ పై కోపంతో ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీలోని బ్రిటన్ హైకమిషన్ ముందు బారికేడ్లను తొలగించినట్లు తెలుస్తోంది. ఇక భారత తాజా చర్యలతో బ్రిటన్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగినట్లు సమాచారం. లండన్ లోని ఇండియన్ హైకమిషన్ కార్యాలయానికి భారీ భద్రతతో పాటు కార్యాలయం ముందు పెద్ద సైజ్ జాతీయ జెండాను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News