దేశంలోకి విదేశీ లాయర్లు, న్యాయ సంస్థలు.. అనుమతిచ్చిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) బుధవారం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) బుధవారం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. విదేశీ న్యాయవాదులు, న్యాయ సంస్థలకు భారత్‌లో లా ప్రాక్టీస్‌కు అనుమతించింది. గతంలో ఈ చర్యలను వ్యతిరేకించిన బీసీఐ భారత్‌లో విదేశీ న్యాయవాదులు, న్యాయ సంస్థల రిజిస్ట్రేషన్, రెగ్యులేషన్ 2022ను నోటిఫై చేసింది. ‘ఓ విదేశీ న్యాయవాది వ్యాజ్యంలో లేని విషయాలలో మాత్రమే న్యాయ విద్యను అభ్యసించడానికి అర్హుడు’ అని నిబంధనలు చెబుతున్నాయి. అంటే విదేశీ న్యాయవాదులు, న్యాయ సంస్థలు కోర్టుకు హాజరు కాలేరు. కానీ బీసీఐలో నమోదు చేసుకోవడం ద్వారా మాత్రమే న్యాయ సలహా ఇవ్వగలరు.
‘విదేశీ న్యాయవాదులు, న్యాయ సంస్థలు ఏ న్యాయస్థానాల ముందు అంటే ట్రిబ్యూనల్ లేదా ఇతర చట్టబద్దమైన లేదా నియంత్రణ అధికారుల ముందు హాజరు కావడానికి వీల్లేదు. జాయింట్ వెంచర్లు, విలీనాలు, కొనుగోళ్లు వంటి ఇతర లావాదేవీల పనులపై మాత్రమే వారు ప్రాక్టీస్ చేయడానికి అనుమతిస్తారు’ అని నోటిఫికేషన్ చెబుతోంది. విదేశీ న్యాయవాది లేదా న్యాయ సంస్థ ఎందులో ప్రాక్టీస్ చేయొచ్చో.. ఎందులో ప్రాక్టీస్ చేయకూడదో బీసీఐ నిర్దేశిస్తుందని నిబంధనలు చెబుతున్నాయి. ఈ విషయంలో న్యాయం కోసం బాక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వాన్ని లేదా న్యాయ మంత్రిత్వ శాఖను సంప్రదించవచ్చు.