అబుధాబిలో తొలి హిందూ ఆలయం.. చరిత్రలో సువర్ణ అధ్యాయమన్న ప్రధాని మోడీ
ఆలయ నిర్మాణంలో యూఏఈ ప్రభుత్వ పాత్ర గురించి ఎంతచెప్పినా తక్కువే..
దిశ, నేషనల్ బ్యూరో: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) రాజధాని అబు ధాబిలో నిర్మించిన తొలి హిందూ ఆలయాన్ని ప్రధాని మోడీ బుధవారం ప్రారంభించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని యూఏఈ వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండో రోజైన బుధవారం.. ప్రవాస భారతీయులు, అధ్యాత్మికవేత్తల సమక్షంలో ‘‘బోచాసనవసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ’’(బీఏపీఎస్) మందిరాన్ని ప్రారంభించారు. పూజారులతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రధాని ‘విశ్వ హారతి’ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా బీఏపీఎస్ నిర్మించిన 1200కు పైగా ఆలయాల్లో ఏకకాలంలో ‘విశ్వ హారతి’ని చేపట్టారు.
ఆలయ ప్రారంభానికన్నా ముందు మందిర నిర్మాణానికి సాయం చేసిన వివిధ మతాలకు చెందిన వ్యక్తులను కలిశారు. ఆలయ ప్రారంభం అనంతరం ప్రధాని మాట్లాడుతూ, అబుదాభిలో హిందూ ఆలయ ప్రారంభంతో ప్రపంచ చరిత్రలో యూఏఈ సువర్ణ అధ్యాయాన్ని లిఖించిందని ప్రశంసించారు. ఈ దేవాలయం ప్రపంచ ఐకమత్యం, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఆలయ ప్రారంభోత్సవం అనేక మందికి ఏళ్లనాటి కల అని చెప్పిన ప్రధాని.. ఇందుకు స్వామినారాయణ ఆశీస్సులు కూడా అందాయని వెల్లడించారు. అలాగే, ఈ ఆలయ నిర్మాణంలో యూఏఈ ప్రభుత్వ పాత్ర గురించి ఎంతచెప్పినా తక్కువేనని, ప్రశంసలు సరిపోవని కొనియాడారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నాహ్యన్ కోసం అక్కడికి హాజరైన ప్రవాసులందరినీ నిల్చోమని, చప్పట్లు కొట్టాల్సిందిగా ప్రధాని కోరారు.
‘‘యావత్ భారత్ తరఫున, ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న కోట్లాది మంది భారతీయుల తరఫున మహ్మద్ బిన్ జాయెద్‌కు, యూఏఈ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని చెప్పారు. ‘‘ఇప్పటివరకు బూర్జ్ ఖలిఫా, ఫూచర్ మ్యూజియం, షేక్ జాయెద్ మసీద్, ఇతర హైటెక్ బిల్డింగులతో ప్రసిద్ధిచెందిన యూఏఈ.. ఇప్పుడు తన గుర్తింపునకు మరో సాంస్కృతిక అధ్యాయాన్ని జోడించింది. రానున్న రోజుల్లో ఈ ఆలయాన్ని సందర్శించేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. దీని వల్ల యూఏఈకి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది. వ్యక్తుల మధ్య అనుబంధాలు సైతం పెరుగుతాయి’’ అని మోడీ తెలిపారు. కాగా, అబు మురేఖాలోని దుబాయ్- అబుధాబి షేక్ జాయెద్ హైవే పక్కన ఉన్న ఈ ఆలయాన్ని.. 27 ఎకరాల్లో సుమారు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించారు. 2019లో ఆలయ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఆలయం కోసం భూమిని యూఏఈ ప్రభుత్వమే విరాళంగా అందజేసింది. ఈ అద్భుత ఆలయాన్ని బీఏపీఎస్ స్వామినారాయణ్ ఇనిస్టిట్యూట్ నిర్మించింది.