Bangladesh: బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దు చేసిన అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్

మంగళవారం పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఢాకా ట్రిబ్యూన్ కథనం పేర్కొంది.

Update: 2024-08-06 14:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రిజర్వేషన్లపై వ్యతిరేకత కారణంగా బంగ్లాదేశ్‌లో పాలన గాడి తప్పింది. షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి దేశం విడిచిపెట్టిన ఒక రోజు తర్వాత, అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ మంగళవారం పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఢాకా ట్రిబ్యూన్ కథనం పేర్కొంది. త్రివిధ సాయుధ దళాల అధిపతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పౌర సమాజ ప్రతినిధులు, రిజర్వేషన్లపై వ్యతిరేకంగా పోరాడిన విద్యార్థి ఉద్యమ నాయకులతో అధ్యక్షుడు షహబుద్దీన్ సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ పార్లమెంటును రద్దు చేసినట్లు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. త్వరలోనే దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అవనుంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) చైర్‌పర్సన్ ఖలీదా జియా జైలు నుంచి విడుదల చేసినట్టు అధ్యక్ష కార్యాలయం వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఈ ఏడాది జూలై 1 నుంచి ఆగష్టు 5 వరకు విద్యార్థి ఉద్యమం, వివిధ కేసుల్లో నిర్బంధించిన వారిని విడుదల చేసే ప్రక్రియ సైతం ప్రారంభమైందని, ఇప్పటికే పలువురిని విడుదల చేసినట్టు తెలిపారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని 78 ఏళ్ల ఖలిదా జియా అనారోగ్యం కారణంగా ఆస్పత్రికే పరిమితమయ్యారు. 2018లో అవినీతికి పాల్పడినట్లు తేలిన నేపథ్యంలో ఆమెకు 17 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. కాగా, రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న షేక్ హసీనా నేతృత్వంలోని అవామి లీగ్ పార్టీ ఈ ఏడాది జనవరిలో వివిధ పరిణామాల మధ్య తిరిగి విజయం సాధించింది. ఆ ఎన్నికలను మిత్రపక్షాలు, బీఎన్‌పీ బహిష్కరించాయి. కానీ, రిజర్వేషన్ల వ్యవహారంలో నెలకొన్న వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో పరిస్థితులు అదుపుతప్పాయి. ఈ క్రమంలోనే హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం నుంచి యూకే వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. 

Tags:    

Similar News