అత్యాధునిక ఫీచర్లతో కొత్త పల్సర్ బైక్‌ను విడుదల చేసిన బజాజ్ ఆటో
జూన్ మొదటివారంలో డెలివరీ అందిస్తామని, నెలరోజుల పాటు రూ. 5,000 మాత్రమే చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో శుక్రవారం తన కొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్ మోడల్‌ను విడుదల చేసింది. దీని ధరను రూ. 1.85 లక్షలు (ఎక్స్-షోరూమ్) నిర్ణయించినట్టు కంపెనీ వెల్లడించింది. 24 ఏళ్లుగా కంపెనీ పోర్ట్‌ఫోలియోలో అత్యంత విజయవంతంగా కొనసాగుతున్న ఈ బైక్ తమకు ముఖ్యమైన ఉత్పత్తి అని కంపెనీ తెలిపింది. జూన్ మొదటివారంలో డెలివరీ అందిస్తామని, నెలరోజుల పాటు రూ. 5,000 మాత్రమే చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది. కొత్త తరం వినియోగదారులకు అనుగుణంగా ఆకర్షణీయమైన డిజైన్‌తో వచ్చిన ఈ పల్సర్ ధర ఈ నెల వరకు మాత్రమే రూ. 1.85 లక్షలకు అందుబాటులో ఉంటుందని, ఆ తర్వాత సవరించనున్నట్టు కంపెనీ ఎండీ రాజీవ్ బజాజ్ చెప్పారు. ఈ బైకును నాలుగు రంగుల్లో లభిస్తుందని, ప్రధానంగా ఇది అత్యాధునిక ఫీచర్లతో ఆకట్టుకోగలదని ఆయన పేర్కొన్నారు. కొత్త ఎన్ఎస్400జెడ్ 373సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుండగా, గంటకు ఏకంగా 154 కిలోమీటర్లు ప్రయాణించనుంది. స్పోర్ట్స్, రెయిన్, ఆఫ్-రోడ్ వంటి నాలుగు భిన్నమైన రైడింగ్ మోడ్‌లతో పాటు డ్యుయెల్ ఛానెల్ ఏబీఎస్ డిస్క్ బ్రేక్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఆశ్చర్యపరుస్తాయని కంపెనీ వివరించింది. ఇక, ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైకును జూన్ 18న మార్కెట్లో విడుదల చేయనున్నట్టు రాజీవ్ బజాజ్ స్పష్టం చేశారు.