Assam College's Advisory: ఒంటరిగా ఉండొద్దు.. రాత్రి బయటకు రావద్దు

అసోంలోని సిల్చార్ మెడికల్ కాలేజ్ జారీ చేసిన అడ్వైజరీపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

Update: 2024-08-14 10:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అసోంలోని సిల్చార్ మెడికల్ కాలేజ్ జారీ చేసిన అడ్వైజరీపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కోల్ కతా మెడికో అత్యాచారం, హత్య నేపథ్యంలో సిల్చార్ మెడికల్ కాలేజ్ వైద్యవిద్యార్థినీలకు పలు సూచనలు జారీ చేసింది. ‘‘మహిళా వైద్యులు, విద్యార్థినులు, సిబ్బంది నిర్మానుష్య ప్రాంతాలు, వెలుతురు లేని ప్రాంతాలు, జనసాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండండి. ఒంటరిగా ఉండకుండా చూసుకోండి. అత్యంత అవసరమైతే తప్ప రాత్రిపూట వసతి గృహాలను వదిలివెళ్లొద్దు. ఒకవేళ వెళ్లాల్సివస్తే అధికారులకు సమాచారం ఇవ్వండి. అపరిచితులతో, అనుమానాస్పద వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. డ్యూటీలో ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి, పరిసరాల గురించి తెలుసుకోవాలి. ప్రజలతో మర్యాదపూర్వకంగా సంభాషించాలి. తద్వారా మీరు అనైతికంగా వ్యవహరించే వ్యక్తుల దృష్టిలో పడకుండా ఉండొచ్చు. ఏదైనా సమస్య ఉన్నా వేధింపులకు గురయినా.. వేధింపుల కమిటీ, క్రమశిక్షణ కమిటీ, అంతర్గత ఫిర్యాదు కమిటీ, ర్యాగింగ్ నిరోధక కమిటీ చైర్‌పర్సన్ లేదా సభ్యులకు సమాచారం అందించాలి” అని అడ్వైజరీలో తెలిపారు.

కాలేజ్ అడ్వైజరీపై విద్యార్థుల ఆందోళన

అయితే, సిల్చార్ మెడికల్ కాలేజ్ విడుదల చేసిన ఉత్తర్వులపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సిల్చార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కు చెందిన జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఈ ఉత్తర్వులపై ఆందోళన వ్యక్తంచేసింది. కాలేజీ యాజమాన్యం జారీ సలహాలను ఖండించింది. అధికారులు తమను గదుల్లో ఉండమని చెప్పకుండా క్యాంపస్‌లో భద్రతా ఏర్పాట్లను మెరుగుపరచాలని అన్నారు. ఆసుపత్రిలో సరైన వెలుతురు, మెరుగైన భద్రతా చర్యలు, ప్రత్యేక వాష్‌రూమ్ సౌకర్యాలు, వైద్యుల గదుల వెలుపల భద్రతను పెంచాలని జూనియర్ డాక్టర్స్ అసోసియేయషన్ డిమాండ్ చేసింది. మరోవైపు, కోల్ కతా అత్యాచారం, హత్య ఘటనపై ఎన్ఎంసీ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీలు, హాస్టల్స్ లో స్టూడెంట్స్ భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అడ్వైజరీ జారీ చేసింది.


Similar News