హైకోర్టులో కేజ్రీవాల్ వర్సెస్ ఈడీ వాదనలు.. టాప్ పాయింట్స్ ఇవే

దిశ, నేషనల్ బ్యూరో : తనను అవమానించడమే కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఏకైక లక్ష్యమని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మండిపడ్డారు.

Update: 2024-04-03 13:50 GMT

దిశ, నేషనల్ బ్యూరో : తనను అవమానించడమే కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఏకైక లక్ష్యమని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మండిపడ్డారు. అవమానపరిచే ఉద్దేశంతోనే తనను ఈడీ అరెస్టు చేసిందని ఆయన ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంను సాకుగా చూపించి లోక్‌సభ ఎన్నికల్లో తనను నిరోధించడమే కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రధాన ఉద్దేశమన్నారు. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణ కాంత శర్మ ధర్మాసనం బుధవారం విచారించింది. మధ్యంతర ఉపశమనం కల్పించాలంటూ ఆప్ చీఫ్ చేసిన విజ్ఞప్తిపై న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్నది. కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ, విక్రం చౌదరి.. ఈడీ తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు వాదనలు వినిపించారు. ఇరు పక్షాలు దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా న్యాయస్థానంలో వాదనలు వినిపించాయి. అనంతరం ఈ తీర్పును హైకోర్టు ధర్మాసనం గురువారానికి రిజర్వ్ చేసింది.

ఆప్ పార్టీని కూల్చివేసేందుకే ఈ అరెస్ట్ : కేజ్రీవాల్

‘‘ఢిల్లీ సీఎంను అరెస్టు చేసిన సమయం పలు సందేహాలకు తావిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఆయన్ను అరెస్టు చేయడం శోచనీయం’’ అని అభిషేక్‌ మను సింఘ్వీ పేర్కొన్నారు. ‘‘రాబోయే ఎన్నికల్లో మొదటి ఓటు వేయకముందే ఆప్ పార్టీని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన కేసు. అరెస్టు కారణంగా కేజ్రీవాల్ లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేరు. రాజ్యాంగ విరుద్ధంగా ఆయన్ను అరెస్టు చేశారు’’ అని కోర్టు దృష్టికి కేజ్రీవాల్ తరఫు న్యాయవాది తీసుకువెళ్లారు.

అరెస్టు చేయొద్దని చెప్పే హక్కు ఖైదీలకు ఉండదు : ఈడీ

ఈడీ తరఫున ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ.. ‘‘నేరస్తులను అరెస్టు చేసి జైల్లోనే పెట్టాల్సి ఉంటుంది. ఎన్నికలున్నాయి కాబట్టి మేం నేరం చేస్తాం.. మమ్మల్ని అరెస్టు చేయొద్దని చెప్పే హక్కు విచారణలో ఉన్న ఖైదీలకు ఉండదు. అలాంటి వాదనను వినిపించడం పూర్తిగా హాస్యాస్పదంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘ఎన్నికలకు ముందు ఒక రాజకీయ నాయకుడు ఎవరినైనా హత్య చేశాడనుకుందాం. అతన్ని అరెస్టు చేయకూడదా ? అతని అరెస్టు వల్ల ఎన్నికలకు ఇబ్బంది కలుగుతుందా ? నేరానికి, ఎన్నికలకు ముడిపెట్టడం తగదు’’ అని ఈడీ న్యాయవాది చెప్పారు.

లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‌కు ప్రత్యక్ష పాత్ర

‘‘ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేశారు. ఎంతో విలువైన ఫోన్లను ధ్వంసం చేశారు. హవాలా ద్వారా వందకోట్ల రూపాయలు ఆప్ పార్టీకి అందాయి. ఆ డబ్బులను గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారు. ఈ విషయంలో ఆప్ కన్వీనర్ హోదాలో కేజ్రీవాలే అన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కుంభకోణంలో ఆయనకు ప్రత్యక్ష పాత్ర ఉంది. ఆప్ మీడియా ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్ కూడా కీలకపాత్ర పోషించారు’’ అని కోర్టుకు ఈడీ వివరించింది. ‘‘బ్లాక్ లిస్టులో ఉన్న లిక్కర్ కంపెనీ ఇండో స్పిరిట్‌కు హోల్ సేలర్ లైసెన్సును సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎలా ఇచ్చారు ? హోల్ సేల్ దుకాణాలకు ఇచ్చే లాభాల వాటాను 5 శాతం నుంచి 12 శాతానికి పెంచి.. పెరిగిన 7 శాతం లాభాలను ముడుపుల రూపంలో ఆప్ పుచ్చుకుంది’’ అని ఈడీ తరఫు న్యాయవాది తెలిపారు.

గతంలోకి వెళితే..

మార్చి 21న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం ఏప్రిల్ 1న తిరిగి హాజరుపరచగా ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను ఢిల్లీలోని తిహార్ జైలుకు తరలించారు. అరెస్టు, ఈడీ రిమాండ్‌ను సవాల్ చేస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తాజాగా బుధవారం విచారించారు.

Tags:    

Similar News