Atishi : తండ్రిని మార్చిందంటూ బీజేపీ నేత వ్యాఖ్యలు.. ఢిల్లీ సీఎం అతిషి కంటతడి
ఢిల్లీ సీఎం అతిషి మీడియా ఎదుట కంటతడి పెట్టారు.
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ సీఎం అతిషి మీడియా ఎదుట కంటతడి పెట్టారు. తండ్రిని మార్చిందంటూ అతిషిపై బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరి చేసిన వ్యాఖలపై ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ‘తన తండ్రి జీవితాంతం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. పేద, మధ్య తరగతికి చెందిన వేల మందికి తన తండ్రి విద్యాబోధన చేశారు. 80 ఏళ్ల వయసులో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ కనీసం నడవలేకపోతున్నారు. వృద్ధుడైన తన తండ్రి పట్ల అసభ్యంగా మాట్లాడాడు. దేశంలో రాజకీయాలు దిగజారిపోతున్నాయంటే నమ్మలేకపోతున్నాను.’ అని అతిషి అన్నారు. ఇక ఇదే అంశంపై ఆప్ చీఫ్ కేజ్రీవాల్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘బీజేపీ నేతల మాటలు సిగ్గుచేటు. ఢిల్లీ సీఎంను వారు అవమానించారు. మహిళా ముఖ్యమంత్రిని కించపర్చిన తీరును ఢిల్లీ ప్రజలు సహించరు. ఢిల్లీలోని మహిళలంతా ఈ అంశంపై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారు.’ అన్నారు. కల్కజీ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత అల్క లాంబా సైతం బీజేపీ నేత వ్యాఖ్యలను తప్పుబట్టారు. రమేష్ బిదూరి మహిళలను కించపర్చేలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు.
ఆ వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నా.. : రమేష్ బిదూరి
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రమేష్ బిదూరి ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. అతిశీ తన తండ్రిని మార్చిందని ఆరోపించారు. మర్లెనాగా ఉన్న అతిశీ ఇప్పుడు అతిశీ సింగ్‌గా మారిందన్నారు. ఉగ్రవాది అఫ్జల్ గురు మరణశిక్షకు వ్యతిరేకంగా అతిశీ తల్లిదండ్రులు క్షమాబిక్ష పిటిషన్‌ను సమర్పించారని తెలిపారు. అయితే తన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారడంతో రమేష్ బిదూరి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన వ్యాఖ్యలను కొంత మంది వక్రీకరించరన్నారు.