Arvind Kejriwal: రూ.10 లక్షల జీవిత బీమా.. కూతురి పెళ్లికి రూ. లక్ష సాయం.. ఆటో డ్రైవర్లపై కేజ్రీవాల్ వరాల జల్లు
త్వరలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi polls) జరగనున్నాయి. ఇలాంటి సమయంలోనే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు పెంచింది.
దిశ, నేషనల్ బ్యూరో: త్వరలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi polls) జరగనున్నాయి. ఇలాంటి సమయంలోనే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే రెండు విడతల్లో 31 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా.. ఇప్పుడు ఆటోడ్రైవర్లపై హామీల వర్షం కురిపించింది. ఓ ఆటో డ్రైవర్ నివాసంలో భోజనానికి వెళ్లిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal).. ఆ తర్వాత ఆటో డ్రైవర్లకు వరాల జల్లు కురిపించారు. వారి కోసం ఐదు హామీలు(5 ‘latest guarantees’) ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాగానే ఆటో డ్రైవర్ కూతురి పెళ్లికి రూ.లక్ష సాయం ఇస్తామని తెలిపారు. అదే విధంగా ప్రతి దీపావళి, హోలీకి రూ.2,500, ఒక్కో ఆటోడ్రైవర్‌కు రూ.10 లక్షల జీవిత బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తామని వెల్లడించారు. ఆటో డ్రైవర్ల పిల్లల పోటీ పరీక్షలకు సంబంధించిన ఫీజులు ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. ‘పూచో యాప్’ ని కూడా ప్రారంభిస్తామన్నారు.
ఆటో డ్రైవర్ ఇంటికి..
ఇక, ఆప్ అధినేత కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్ని వర్గాల ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో ఆటో డ్రైవర్లకు (Auto Drivers) తేనేటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ ఆటో డ్రైవర్ కేజ్రీని భోజనానికి ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు మంగళవారం ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో కేజ్రీ లంచ్ చేశారు. తన సతీమణి సునీతతో కలిసి తన ఇంటికి వచ్చిన కేజ్రీవాల్‌కు ఆటో డ్రైవర్ కుటుంబం ఘనంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా అక్కడ కేజ్రీ లంచ్ చేశారు. ఆ తర్వాత హామీల జల్లుని కురిపించారు.