ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్.. నెక్ట్స్ జరగబోయేది ఇదే !
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలన పరిణామం గురువారం రాత్రి చోటుచేసుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలన పరిణామం గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. అంతకుముందు గురువారం సాయంత్రమే ఈడీ డిప్యూటీ డైరెక్టర్ జోగేందర్ నేతృత్వంలోని 8 మంది అధికారుల బృందం ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసంలోకి వెళ్లింది. ఈక్రమంలో సెర్చ్ వారెంట్‌ను చూపించాలని సీఎం కేజ్రీవాల్ సిబ్బంది అడగగా.. దానితోనే వచ్చామని ఈడీ అధికారులు బదులిచ్చి లోపలికి వెళ్లినట్లు తెలిసింది. లిక్కర్ కేసుతో ముడిపడిన అంశాలపై కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50 కింద ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. మరోవైపు దాదాపు రెండున్నర గంటల పాటు నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ వెంటనే ఆయనను ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు.కేజ్రీవాల్‌కు శుక్రవారం వైద్యపరీక్షలు నిర్వహించి ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో హాజరుపర్చనున్నారు.
ఇవాళ విచారించకుంటే.. జరిగేది అదే
తన అరెస్టుపై కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం రిట్ పిటిషన్‌ను దాఖలు చేసిన కేజ్రీవాల్ తరఫు న్యాయవాది.. దీనిపై గురువారం రాత్రే అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. అయితే అందుకు న్యాయస్థానం నుంచి అనుమతి లభించలేదు. దీంతో ఈ వ్యవహారంలో అత్యవసర విచారణను శుక్రవారం రోజు చేపట్టేందుకు టైం ఫిక్స్ చేశారు. ఈ వారంలో శుక్రవారం ఒక్క రోజే సుప్రీంకోర్టుకు వర్కింగ్ డే. శనివారం నుంచి ఈ నెల 30 వరకు సుప్రీంకోర్టుకు వరుస సెలవులు ఉన్నాయి. సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరగకపోతే తిరిగి ఏప్రిల్ 1న మాత్రమే అందుకు వెసులుబాటు ఉంటుంది. దీంతో ఈడీ ఆఫీసర్లు ఈ తేదీలను చూసుకునే పక్కా ప్లానింగ్‌తో కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి ఉండొచ్చనే వాదన తెరపైకి వచ్చింది.
కవిత అరెస్టు జరిగిన వారంలోనే..
కేజ్రీవాల్ నివాసానికి ఈడీ టీమ్ వెళ్లిన సమయానికే ఇంటి చుట్టూ ఢిల్లీ పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు. ఆ ఇంటి వైపునకు వెళ్లే దారులన్నీ పోలీసులు మూసేశారు. మరోవైపు ఈడీ హెడ్ క్వార్టర్ దగ్గర కూడా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇదే కేసులో కీలక నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గత శుక్రవారం సాయంత్రమే ఈడీ హైదరాబాద్‌లో అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్లింది. ప్రస్తుతం ఆమె ఈడీ కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్నారు. కవిత అరెస్టు జరిగిన సరిగ్గా వారంలోనే కేజ్రీవాల్‌ను కూడా ఈడీ అదుపులోకి తీసుకోవడం గమనార్హం.
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం: ఢిల్లీ హైకోర్టు
లిక్కర్ స్కాం కేసులో తాను ఈడీ విచారణకు సహకరించేందుకు సిద్ధమని, అయితే అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌కు ఢిల్లీ హైకోర్టు గురువారం ఉదయం నో చెప్పింది. తీవ్ర చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని కేజ్రీవాల్ ఆ పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. కానీ జస్టిస్ సురేశ్ కుమార్ కెయిట్, జస్టిస్ మనోజ్ జైన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మాత్రం ఈడీ అరెస్టు చేయకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని, ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే సెర్చ్ వారెంట్‌తో 12 మందితో కూడిన ఈడీ బృందం కేజ్రీవాల్ నివాసానికి చేరుకొని.. అరెస్టు చేయడం గమనార్హం.
తొమ్మిదిసార్లు కేజ్రీవాల్‌కు నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టయి జైల్లో ఉన్నారు. దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ అధికారులు గతేడాది అక్టోబరు నుంచి తొమ్మిదిసార్లు కేజ్రీవాల్‌కు నోటీసులు జారీచేశారు. కానీ ఒక్కసారి కూడా కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. ప్రతీసారి ఒక కారణాన్ని చూపి విచారణకు గైర్హాజరు కావడంపై ఈడీ అధికారులు అసంతృప్తితో ఉన్నారు. విచారణకు హాజరయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ రౌస్ ఎవెన్యూ కోర్టుకు ఈడీ విజ్ఞప్తి చేసింది. దీంతో తమ ఎదుట హాజరుకావాలని కేజ్రీవాల్‌కు కోర్టు నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఆ ప్రకారం ఈ నెల 16న కోర్టుకు హాజరుకాగా ఆయన విజ్ఞప్తి మేరకు బెయిల్ మంజూరైంది. ఆ తర్వాత మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. కానీ ఆప్ చీఫ్ గైర్హాజరయ్యారు. ఈలోగా అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు గురువారం ఉదయం తేల్చి చెప్పడంతో ఈడీ అధికారులు సెర్చ్ వారెంటుతో కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళారు.
కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసుల పర్వం
* తొలి నోటీసు : నవంబరు 2, 2023
* రెండో నోటీసు : డిసెంబరు 21, 2023
* మూడో నోటీసు : జనవరి 3, 2024
* నాలుగో నోటీసు : జనవరి 18, 2024
* ఐదో నోటీసు : 2024 ఫిబ్రవరి 2, 3
* ఆరో నోటీసు : ఫిబ్రవరి 19, 2024
* ఏడో నోటీసు : ఫిబ్రవరి 26, 2024
* ఎనిమిదో నోటీసు : మార్చి 4
* తొమ్మిదో నోటీసు : మార్చి 21
ఈడీ చార్జిషీట్లలోనూ కేజ్రీవాల్ పేరు..
ఢిల్లీ లిక్కర్ కేసులో సౌత్ గ్రూపు నుంచి రూ. 100 కోట్ల ముడుపులు అందుకున్నవారిలో కేజ్రీవాల్‌తో పాటు సిసోడియా కూడా ఉన్నారని ఈడీ పలు చార్జిషీట్లలో ప్రస్తావించింది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన 12 మంది ఇచ్చిన స్టేట్‌మెంట్లలో కూడా కేజ్రీవాల్ పేరు వినిపించినట్లు ఈడీ గుర్తుచేసింది. అరెస్టు చేయడానికి ఈడీ సిద్ధమవుతున్నదంటూ స్వయంగా కేజ్రీవాల్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కూడా మీడియా సమావేశాల్లో వెల్లడించారు. ఎంక్వయిరీకి హాజరుకాకుండానే ఈడీ అధికారులు ఏం కోరుకుంటున్నారో ఎలా తెలుస్తుందంటూ కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. నిజంగా అరెస్టు చేస్తారనే భయమే ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది.
రూ.100 కోట్ల ముడుపులు..
ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో మద్యం తయారీదారులు, హోల్‌సేల్ వ్యాపారులు, రిటైల్ దుకాణాలకు మేలు జరిగేలా కేజ్రీవాల్ ప్రభుత్వం వ్యవహరించిందనే ఆరోపణ ఉంది. కొందరికి అక్రమ ప్రయోజనం చేకూర్చేందుకు కేజ్రీవాల్ సర్కారులోని పెద్దలు రూ. 100 కోట్ల మేర ముడుపులు తీసుకున్నారని ఈడీ అంటోంది. ఈ వ్యవహారంలో కేజ్రీవాల్, మనీష్ సిసోడియాల కీలక పాత్ర ఉందని ఆరోపిస్తోంది.