తీహార్ జైలులో ఢిల్లీ సీఎంకి తొలిరోజు ఎలా గడిచిందంటే?
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు. ఏప్రిల్ 15వరకు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు.
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు. ఏప్రిల్ 15వరకు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. దీంతో భారీ బందోబస్తు మధ్య జైల్లో ఉన్నారు కేజ్రీవాల్. కాగా.. కేజ్రీవాల్ హెల్త్ పై అప్ డేట్ ఇచ్చారు జైలు అధికారులు. తొలిరోజు కేజ్రీవాల్ నీరసంగా, ఆందోళనగా ఉన్నారని.. షుగర్ లెవల్స్ పడిపోయాయని అన్నారు జైలు అధికారులు. కేజ్రీవాల్ నిద్రలేమితో భాదపడ్డారని.. సోమవారం రాత్రి కొద్దిసేపే నిద్రపోయారని తెలిపారు.
కేజ్రీవాల్ కు లో షుగర్
మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తర్వాత రెండుసార్లు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఇక ఏప్రిల్ 1న కోర్టులో హాజరుపరచగా.. ఆయన్ని 15రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో సోమవారం రాత్రి 4 గంటలకు తీహార్ జైలుకు తరలించారు అధికారులు. జైల్లోకి పంపేముందు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆ రిపోర్టులో లో షుగర్ ఉందని.. షుగర్ లెవల్స్ 50 కంటే తక్కువగా ఉన్నట్లు తేలింది.
దీంతో డాక్టర్ల సూచన మేరకు మెడిసిన్ అందించారు అధికారులు. సెల్ లో పరుపు, దుప్పట్లు, రెండు పిల్లోలు అందించినట్లు తెలిపారు. కానీ నేలపైనే కేజ్రీవాల్ పడుకున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి వరకు సెల్ లో అటు, ఇటూ తిరుగుతూ కన్పించినట్లు తెలిపారు అధికారులు. రాత్రిపూట ఇంటిభోజనాన్ని వడ్డించారని తెలిపారు.
ఇంటి భోజనానికి అనుమతి
ఇక మంగళవారం ఉదయాన్నే ధ్యానం చేసుకున్న కేజ్రీవాల్‌కు.. ఆ తర్వాత చాయ్, రెండు బిస్కట్లు తిన్నారు. ఆ తర్వాత మరోసారి మెడికల్ టెస్టులు చేశారు. షుగర్ లెవల్స్ ఇంకా తక్కువగానే ఉన్నట్లు తెలిపారు అధికారులు. షుగర్ లెవల్స్ సాధారణ స్థితికి వచ్చేవరకు మధ్యాహ్నం, రాత్రి ఇంటి భోజనాన్నే అనుమతిస్తామన్నారు అధికారులు.
కేజ్రీవాల్ కోసం క్విక్ రియాక్షన్ టీం
కేజ్రీవాల్ ఉన్న జైలురూం బయట జైలు వార్డర్‌తోపాటు ఇద్దరు భద్రతా సిబ్బందిని నియమించారు. ఎమర్జెన్సీ కోసం కేజ్రీవాల్ గది బయట క్విక్ రియాక్షన్ టీంని సిద్ధంగా ఉంచారు. సీసీ కెమెరాల ద్వారా కేజ్రీవాల్ ని నిరంతరం గమనిస్తున్నారు అధికారులు. కేజ్రీవాల్ కోరిన విధంగానే రామాయణం, భగవద్గీత, హౌ ప్రైమ్ మినిస్టర్ డిసైడ్స్ పుస్తకాలు అందించారు. ఆయన మెడలో ఉన్న లాకెట్ ని కూడా ఇచ్చారు. జైలు నిబంధనలకు అనుగుణంగా కేజ్రీవాల్ తన భార్య, కుమారుడు, కుమార్తె, అతని ప్రైవేట్ సెక్రటరీ బిభవ్ కుమార్, ఆప్ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ సహా ఆరుగురు వ్యక్తుల జాబితాను అందించారు. మరోవైపు కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆయన భార్య సునితా సహా ఆప్ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.