MUDA Scam: నేనేం తప్పు చేయలేదు.. రాజీనామా చేయను

కర్ణాటక రాజకీయాల్లో మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. దీనిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు.

Update: 2024-08-17 11:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక రాజకీయాల్లో మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. దీనిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ‘స్కామ్’కు సంబంధించి విచారణకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చిన కొన్ని గంటలకే ఆయన దీనిపై మాట్లాడారు. తాను ఎలాంటి “తప్పు చేయలేదని” పేర్కొన్నారు. మీడియా మాట్లాడుతూ.. గవర్నర్ నిర్ణయం "రాజ్యాంగ వ్యతిరేకం", "చట్టానికి విరుద్ధం" అని అన్నారు. "నేను రాజీనామా చేసేంత తప్పేమీ చేయలేదు. దీనిపై కోర్టుకెళ్తాను" అని పేర్కొన్నారు. మొత్తం కేబినెట్, పార్టీ హైకమాండ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు అంతా నా వెంటే ఉన్నారని చెప్పారు. “బీజేపీ, జేడీ(ఎస్) కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి కుట్ర పన్నుతారని ఆరోపించారు.

సిద్ధరామయ్యకు శివకుమార్ మద్దతు

సిద్ధరామయ్యకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతిచ్చారు. ‘‘గవర్నర్ తన సెక్రటరీ ద్వారా రాజ్యాంగ విరుద్ధమైన లేఖను పంపారు. కర్ణాటక రాష్ట్రం, కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్యకు అండగా ఉంది. ఆయన మా సీఎం. ఆయనే సీఎంగా ఉంటారు. అసలు అక్కడ కేసు లేదు. కానీ వివాదం చేస్తున్నారు. దీనిపై న్యాయపరంగా ముందుకెళ్తాం రాజకీయంగానూ పోరాడుతాం” అని శివకుమార్ మీడియాతో అన్నారు. ఇదంతా ఓ కుట్ర అని ఆరోపించారు. గవర్నర్ కార్యాలయాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని అన్నారు. కర్ణాటక మంత్రి కృష్ణ బైరేగౌడ విలేకరులతో మాట్లాడుతూ.. గవర్నర్ అనుసరించిన విధానం "పూర్తిగా చట్టవిరుద్ధం" అని అన్నారు.



Similar News