ఇండియా కూటమికి మరో షాక్: జోడో న్యాయ్ యాత్రకు నితీశ్ దూరం!

పశ్చిమ బెంగాల్‌లో ఒంటరిగా పోటీ చేస్తానని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ఇండియా కూటమికి షాకిచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-01-25 10:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో ఒంటరిగా పోటీ చేస్తానని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ఇండియా కూటమికి షాకిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జేడీయూ అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ సైతం ఇదే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిబెంగాల్ లో కొనసాగుతోంది. రెండు రోజుల అనంతరం బీహార్‌లోకి యాత్ర ప్రవేశించనుంది. అయితే బిహార్‌లో చేపట్టనున్న జోడో న్యాయ్ యాత్రకు నితీశ్ కుమార్ దూరంగా ఉండనున్నట్టు జేడీయూ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు షకీల్ అహ్మద్ ఖాన్ ద్వారా బుధవారం సాయంత్రం నితీశ్‌కు ఆహ్వానం అందిందని, అయితే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల విషయంలో జాప్యం జరగడంతో ఇప్పటికే అసంతృప్తితో ఉన్న నితీశ్ జోడో యాత్రలో పాల్గొనడం లేదని వెల్లడించాయి. ఇప్పటికే బెంగాల్‌లో టీఎంసీ, పంజాబ్‌లో ఆప్ ఒంటరిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించడం, తాజాగా నితీశ్ వ్యవహారంతో ఇండియా కూటమికి పెద్ద షాక్ తగిలిందని చెప్పవచ్చు.

కూటమి ఏర్పాటులో నితీశ్‌దే కీలక పాత్ర

బిహార్‌లో బీజేపీతో పొత్తును వదిలిపెట్టుకున్న నితీశ్ కుమార్ ఎన్డీయేకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఐక్యం చేసే బాధ్యతను తన భుజాన వేసుకున్నారు. దేశమంతా తిరుగుతూ బిజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఏకం చేశారు. కూటమి కన్వీనర్‌గా సైతం నితీశ్ నియామకం కానున్నారనే వార్తలు వచ్చాయి. అయితే వాటిని తిరస్కరించిన నితీశ్ కూటమిలో సభ్యుడిగానే ఉంటానని ప్రకటించారు. కానీ తాజాగా కూటమి సమావేశాల్లో పాల్గొనకపోవడం, భారత్ జోడో న్యాయ్ యాత్రకు హాజరుకాకపోవడం వంటి పరిణామాలు ఏర్పడడటం చర్చకు దారి తీసింది. అయితే ఇండియా కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన నితీశ్ ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

Tags:    

Similar News