మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు మరో షాక్: బీజేపీలో చేరనున్న సీనియర్ నేత!

పార్లమెంటు ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు మహారాష్ట్రలో మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బసవరాజ్ పాటిల్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశారు.

Update: 2024-02-27 06:06 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు మహారాష్ట్రలో మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బసవరాజ్ పాటిల్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశారు. మంగళవారం ఆయన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే సమక్షంలో బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. కాగా, బసవరాజ్ ధారశివ్ జిల్లా మురుమ్ ప్రాంతా నివాసి.1999 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1994 నుంచి 2004 వరకు మహారాష్ట్రలో గ్రామీణాభివృద్ధి మంత్రిగా పని చేశారు. అనంతరం 2019లో ఎమ్మెల్యేగా ఓడిపోగా..కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ అవకాశం కల్పించింది. అప్పటి నుంచి ఆయన బాధ్యతలు చేపట్టారు. బసవరాజ్ పాటిల్‌కు మరఠ్వాడా ప్రాంతంలో అత్యధిక ప్రాబల్యం ఉంది.

ఇటీవల మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మిలింద్ డియోరా, బాబా సిద్ధిఖీతో సహా పలువురు సీనియర్ నాయకులు పార్టీని వీడిన విషయం తెలిసిందే. చవాన్ బీజేపీలో చేరగా, డియోరా ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. దీంతో తాజాగా బసవరాజ్ రాజీనామాతో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలినట్టు అయింది. మరోవైపు ఇండియా కూటమిలో మహారాష్ట్రలో సీట్ షేరింగ్‌పై చర్చలు జరుగుతుండగా, పాటిల్ రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే బసవరాజ్ రాజీనామా వార్తలను కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నానా పటోలే ఖండించారు. పాటిల్ నుంచి తనకు ఎటువంటి లేఖ అందలేదని స్పష్టం చేశారు. కానీ చాలా కాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని తెలిపారు. 

Tags:    

Similar News