అదానీ వ్యవహారంపై సుప్రీంలో మరో పిటిషన్
దేశ రాజకీయాలల్లో పెను సంచలనంగా మారిన అదానీ - హిండెన్ బర్గ్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.
దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజకీయాలతో పాటు మార్కెట్లో పెను సంచలనంగా మారిన అదానీ - హిండెన్ బర్గ్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానంలో ఇప్పటికే రెండు పిటిషన్లు దాఖలు కాగా ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. అదానీ సంస్థల్లో ఎల్ఐసీ, ఎస్‌బీఐ పెట్టుబడులు పెట్టాయని జయ ఠాకూర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం ఎల్లుండి విచారిస్తామని తెలిపింది. ఇప్పటికే దాఖలైన రెండు పిటిషన్లను కూడా ఎల్లుండి విచారణ చేపడతామని పేర్కొంది. కాగా అదానీ వ్యవహారంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేందుకు అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే.