Amith shah: కేరళను ముందే హెచ్చరించాం.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా

వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం పొంచి ఉందని కేరళకు ముందే హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు.

Update: 2024-07-31 12:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం పొంచి ఉందని కేరళకు ముందే హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో పాటు కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని జూలై 23వ తేదీనే వార్నింగ్ ఇచ్చామన్నారు. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కేరళలో జూలై 23వ తేదీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించామని, అలాగే 26వ తేదీన కూడా ఈ విపత్తు కొనసాగే చాన్స్ ఉందని మరోసారి హెచ్చరించినట్టు చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని ఆరోపించారు. కొండచరియలు విరిగిపడవచ్చనే ఆందోళనల నేపథ్యంలో జూలై 23న తొమ్మిది ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రాష్ట్రానికి పంపామని గుర్తు చేశారు. కానీ కేరళ ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఎందుకు తరలించలేదో తెలియడం లేదన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను పలు రాష్ట్రాలు పాటించాయని, దాని వల్ల ప్రాణ నష్టం తప్పిందని తెలిపారు. ఒడిశాలోనూ నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏడు రోజుల ముందుగానే హెచ్చరికలు పంపామని, వారు ఆ సలహాలు పాటించడం వల్ల ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదన్నారు. అలాగే గుజరాత్ రాష్ట్రానికి సైతం మూడు రోజుల ముందుగానే విపత్తు గురించి వార్నింగ్ ఇచ్చామని, సకాలంలో చర్యలు తీసుకోవడం వల్ల అక్కడ కూడా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు. కాగా, కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి భారీగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News