Amith shah: ప్రపంచ సమస్యగా మాదకద్రవ్యాల వ్యాపారం.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా
చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల వ్యాపారం భారతదేశానికి సవాల్ మాత్రమే కాదని, ఇది ప్రపంచ సమస్యగా కూడా అవతరించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల వ్యాపారం భారతదేశానికి సవాల్ మాత్రమే కాదని, ఇది ప్రపంచ సమస్యగా కూడా అవతరించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దేశం దృఢ సంకల్పంతో, వ్యూహంతో ముందుకు సాగితే ఈ ముప్పును ఎదుర్కోగలదని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో మాదక ద్రవ్యాల నియంత్రణపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో అమిత్ షా ప్రసంగించారు. అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారం ద్వారా వచ్చే డబ్బును ఉగ్రవాదం, నక్సలిజాన్ని వ్యాప్తి చేయడం, దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడం వంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు.
మాదక ద్రవ్యాల నియంత్రణలో విజయం సాధించాలంటే డ్రగ్స్ డిటెక్షన్, నెట్‌వర్క్ ధ్వంసం, నేరస్థుల నిర్బంధం వంటి సూత్రాలను అనుసరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఈ ముప్పుపై అవగాహన పెంచాల్సి ఉందన్నారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 2047లో దేశాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దుతామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడంతో క్రమంగా ఇది 130 కోట్ల జనాభా తీర్మానంగా మారింది. సంపన్నమైన, సురక్షితమైన దేశాన్ని రూపొందించడంలో మాదకద్రవ్యాల రహిత భారత్ తీర్మానం ఎంతో ముఖ్యమైందని విశ్వసిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు.
భారతదేశంలో మాదక ద్రవ్యాల విక్రయం కేవలం నిషేధిత సమస్య మాత్రమే కాదని, ఇది జాతీయ భద్రతతో కూడా ముడిపడి ఉందని నొక్కి చెప్పారు. యువతను నాశనం చేయడమే కాకుండా, ఈ వ్యాపారం ద్వారా వచ్చే డబ్బును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారన్నారు. జీరో టాలరెన్స్ విధానంతో దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మాదకద్రవ్యాల వ్యాపార నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేయడంలో శాస్త్రీయ పరిశోధనపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో మత్తు పదార్థాక వాడకం1.45 శాతంగా ఉందని, ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ అని అన్నారు. ఇది ఆందోళన కలిగించే విషయమని చెప్పారు.