J&K: మూడు కుటుంబాలు జమ్మూకశ్మీర్‌ను దోచుకున్నాయి: అమిత్ షా
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన జమ్మూకశ్మీర్‌లో రాజకీయ ప్రచారాలు రోజు రోజుకు ఉపందుకుంటున్నాయి
దిశ, నేషనల్ బ్యూరో:అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన జమ్మూకశ్మీర్‌లో రాజకీయ ప్రచారాలు రోజు రోజుకు ఉపందుకుంటున్నాయి. తాజాగా శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడ పర్యటిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మెహబూబా ముఫ్తీకి చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)తో కలిసి ఎన్‌సీ-కాంగ్రెస్ కూటమి.. జమ్మూకశ్మీర్ వేర్పాటువాదులు, ఉగ్రవాద సానుభూతిపరులను విడుదల చేయాలని కోరుతూ ఈ ప్రాంతాన్ని అస్థిర పరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు జమ్మూలో బహిరంగ ర్యాలీలో ప్రసంగించిన షా, ఈ మూడు కుటుంబాలు జమ్మూకశ్మీర్‌ని దోచుకున్నాయి. వారు అధికారంలోకి వస్తే ఉగ్రవాదం తిరిగి వస్తుంది. జమ్మూ ప్రజలు వారి భవిష్యత్తును నిర్ణయించుకోవాలి, బీజేపీ అధికారంలోకి వస్తే, టెర్రరిస్టులను తల ఎత్తనివ్వమని అన్నారు. కూటమి జమ్మూ హక్కులను హరించడం, ఈ ప్రాంతానికి స్వయంప్రతిపత్తిని తిరిగి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నాయి, ఇది ఎప్పటికీ జరగదని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు J&Kలో స్వయం ప్రతిపత్తి గురించి మాట్లాడటానికి ఏ శక్తి ధైర్యం చేయదని షా చెప్పారు.
అలాగే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కూడా విరుచుకుపడ్డారు. రాహుల్ జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తామని చెప్పారు. అలా చేసే అధికారం ఆయనకు ఉందా?.. నేను ఇప్పటికే పార్లమెంట్‌లో చెప్పాను.. ఎన్నికల తర్వాత తగిన సమయంలో రాష్ట్ర హోదాను తిరిగి ఇస్తామని, రాహుల్ ప్రజలను మోసం చేయడం, తప్పుదోవ పట్టించడం ఆపాలని అన్నారు. శంకరాచార్య కొండ పేరును తఖ్త్-ఎ-సులేమాన్‌గా మార్చేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, గుజ్జర్, బకర్వాల్, పహారీ వర్గాల వారి రిజర్వేషన్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ చర్యను అడ్డుకుంటామని షా తెలిపారు.
రాబోయే ఎన్నికలు చారిత్రాత్మకమైనవని ఈ సందర్భంగా అన్నారు. పాకిస్థాన్‌తో మాట్లాడాలని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. శాంతి నెలకొనే వరకు పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలు ఉండవని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లోని 90 మంది సభ్యుల అసెంబ్లీకి మూడు దశల్లో ఓటు వేయనున్నారు. మొదటి దశ సెప్టెంబర్ 18న, తదుపరి రౌండ్లు సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న, 8న కౌంటింగ్ జరగనుంది.