2024లో బీజేపీకి 300కుపైగా సీట్లు.. అమిత్ షా కామెంట్స్
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 300కుపైగా సీట్లలో ఘన విజయం సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.
గౌహతి: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 300కుపైగా సీట్లలో ఘన విజయం సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. వరుసగా మూడోసారి నరేంద్రమోడీ ప్రధానమంత్రి పదవిని చేపడతారని జోస్యం చెప్పారు. అస్సాంలో పర్యటించిన అమిత్ షా.. అక్కడ జరిగిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నెగెటివ్ మైండ్ సెట్‌తో ఉందని.. అందుకే కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరించడం ద్వారా రాజకీయాలు చేస్తోందని విమర్శలు గుప్పించారు. కొత్త పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతే ప్రారంభించాలనే సాకును చూపించి..సరికొత్త నాటకానికి కాంగ్రెస్ తెర తీస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోని కొత్త అసెంబ్లీ భవనాలకు ఆయా రాష్ట్రాల గవర్నర్లను పక్కనబెట్టి.. ముఖ్యమంత్రులు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు శంకుస్థాపనలు చేసిన సందర్భాలు ఉన్నాయని అమిత్ షా మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న స్థానాలు కూడా 2024 ఎన్నికల్లో దక్కవని, ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోతుందని విమర్శించారు. దేశ ప్రధానిని గౌరవించకపోవడం అంటే.. దేశ ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానించినట్లేనని అమిత్ షా వ్యాఖ్యానించారు. పోలీసుల థర్డ్ డిగ్రీపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. "ఇది థర్డ్ డిగ్రీ ప్రయోగించే కాలం కాదు.. ప్రత్యామ్నాయంగా ఫోరెన్సిక్ విభాగాలను వాడుకోవాలి" అని సూచించారు. అస్సాంలోని గౌహతిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ వర్సిటీకి అమిత్ షా శంకుస్థాపన చేశారు. "మణిపూర్ లో ఘర్షణలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ఇరువర్గాలు శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూడాలి. త్వరలో మణిపూర్ వెళ్తాను. అక్కడ 3 రోజులు ఉండి శాంతి నెలకొల్పేలా చూస్తా" అని వెల్లడించారు.