Amit Shah : ప్రఖ్యాత ప్రాంతాలకు ఇస్లామిక్ పేర్లు పెడతారట.. నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోపై అమిత్‌షా భగ్గు

దిశ, నేషనల్ బ్యూరో : కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నందుకు కాంగ్రెస్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విరుచుకుపడ్డారు.

Update: 2024-08-23 14:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నందుకు కాంగ్రెస్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దురుద్దేశాలకు, రహస్య ఎజెండాలకు ఈ పొత్తు నిదర్శనమని ఆయన ఆరోపించారు. కశ్మీర్‌లో అధికారంలోకి రావాలనే కోరిక తప్పించి, అక్కడి ప్రజలను ఉద్ధరించాలనే ఆశయం కాంగ్రెస్‌కు లేదన్నారు. ఈమేరకు కాంగ్రెస్‌కు, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి 10 అంశాలపై ప్రశ్నలు సంధిస్తూ ‘ఎక్స్’ వేదికగా అమిత్‌షా ఒక పోస్ట్ చేశారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగానే జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక జెండాను తీసుకొస్తామనే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ హామీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోందా ?’’ అని కేంద్ర హోంమంత్రి ప్రశ్నించారు. ‘‘కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370, 35ఏలను పునరుద్ధరిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అంటోంది. ఒకవేళ అదే జరిగితే మళ్లీ కశ్మీర్ అగ్నిగుండం అయ్యే ముప్పు పొంచి ఉంది. అంతటి ప్రమాదకరమైన ఎన్నికల హామీకి కాంగ్రెస్ కూడా మద్దతు పలుకుతుందా ?’’ అని అమిత్‌షా ప్రశ్నను సంధించారు. పాకిస్తాన్‌తో చర్చల విషయంలో నేషనల్ కాన్ఫరెన్స్ - కాంగ్రెస్ పార్టీల కూటమి వైఖరేంటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ చర్చలను మొదలుపెడితే కశ్మీర్‌లో వేర్పాటువాదానికి ఊతం లభిస్తుందని కేంద్ర హోంమంత్రి అభిప్రాయపడ్డారు.

ఎల్‌ఓసీ రూట్‌లో ఉగ్రవాదం రవాణా..

‘‘సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) మీదుగా పాకిస్తాన్‌తో వాణిజ్యం జరపాలని నేషనల్ కాన్ఫరెన్స్ అంటోంది. ఆ విషయంలో కాంగ్రెస్ వైఖరి ఏమిటి ? ఎల్‌ఓసీ మార్గంలో వాణిజ్యం మొదలుపెడితేే ఉగ్రవాద కార్యకలాపాలకు ఆస్కారం ఏర్పడుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘కశ్మీర్‌లో దళితులు, గుజ్జర్‌లు, బకర్వాల్స్, పహాడీ తెగలకు రిజర్వేషన్లను రద్దు చేస్తామని నేషనల్ కాన్పరెన్స్ అంటోంది. కాంగ్రెస్ కూడా దాన్ని సమర్ధిస్తుందా ?’’ అని అమిత్ షా ప్రశ్నించారు. ‘‘కశ్మీర్‌లోని ప్రఖ్యాత శంకరాచార్య హిల్, హరి హిల్‌లకు ఇస్లామిక్ పేర్లు పెడతామని నేషనల్ కాన్ఫరెన్స్ అంటోంది. కాంగ్రెస్ పార్టీ వంత పాడుతుందా ?’’ అని అడిగారు. ‘‘శంకరాచార్య హిల్‌కు ‘తఖ్తే సులేమాన్’ , హరి హిల్‌కు ‘కోహే మారన్’ అనే పేర్లు ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటుందా ?’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News