Amit Shah: త్వరలోనే యాంటీ డ్రోన్ యూనిట్‌ ఏర్పాటు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా

సరిహద్దుల రక్షణ కోసం భారత్‌ త్వరలో కాంప్రెహెన్సివ్ యాంటీ డ్రోన్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు అమిత్‌ షా తెలిపారు.

Update: 2024-12-08 14:09 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సరిహద్దుల రక్షణ కోసం భారత్‌ త్వరలో కాంప్రెహెన్సివ్ యాంటీ డ్రోన్‌ యూనిట్‌ (Anti drone Unit)ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amith shah) తెలిపారు. మానవ రహిత డ్రోన్‌ల ముప్పు రోజురోజుకూ తీవ్రమవుతోందని, దానిని అరికట్టేందుకు సమగ్ర వ్యూహం అనుసరిస్తున్నామని చెప్పారు. భారత్-పాకిస్థాన్ (India pakisthan) సరిహద్దుకు 300 కిలోమీటర్ల దూరంలో రాజస్థాన్‌లోని జోధ్ పూర్‌(Jodhpur)లో ఆదివారం జరిగిన బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ (BSF) 60వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో అమిత్ షా ప్రసంగించారు. డ్రోన్ ముప్పును ఎదుర్కోవడానికి ‘లేజర్ ఎక్విప్డ్ యాంటీ డ్రోన్ గన్ మౌంటెడ్ సిస్టమ్‌’కు సంబంధించిన ప్రారంభ ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని చెప్పారు.

ఈ ఏడాది ఇప్పటివరకు 260కి పైగా డ్రోన్‌లను పాక్ సరిహద్దుల నుంచి గుర్తించామని వాటిలో కొన్నింటిని స్వాధీనం చేసుకోగా, మరికొన్ని కాల్చివేశామని చెప్పారు. గతేడాది ఈ సంఖ్య 110గా ఉందని తెలిపారు. ఈ డ్రోన్‌లలో ఎక్కువ భాగం పంజాబ్‌లో ఆయుధాలు, డ్రగ్స్‌తో పట్టుబడినట్టు చెప్పారు. రానున్న రోజుల్లో డ్రోన్ ముప్పు మరింత తీవ్రం కానుందని, డీఆర్డీఓతో కలిపి వీటిని పూర్తిగా ఎదుర్కునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అతి త్వరలోనే యాంటి డ్రోన్ యూనిట్ రూపొందించనున్నట్టు తెలిపారు. భారతదేశ సరిహద్దులను భద్రపరిచేందుకు సమగ్ర ఇంటిగ్రేటెడ్ బోర్డర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CIBMS) పని పురోగతిలో ఉందన్నారు.

కాగా, దాదాపు 2.65 లక్షల మంది సిబ్బందితో కూడిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) డిసెంబర్ 1, 1965న ఏర్పాటైంది. ఇది భారత సరిహద్దుల వద్ద వివిధ విధులను నిర్వర్తిస్తుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల సరిహద్దు వద్ద దేశ రక్షణలో నిమగ్నమై ఉంది. 6,300 కిలోమీటర్ల పొడవైన సరిహద్దుల్లో రక్షణగా ఉంటుంది.  

Tags:    

Similar News