చైనాతో మాల్దీవుల దోస్తీ.. మాలేకు బయలుదేరిన డ్రాగన్ గూఢచారి నౌక

దిశ, నేషనల్ బ్యూరో : మాల్దీవుల కొత్త దేశాధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చైనా వైపు మొగ్గుచూపుతున్నారనే సంకేతాలను పంపే ఓ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-01-23 11:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మాల్దీవుల కొత్త దేశాధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చైనా వైపు మొగ్గుచూపుతున్నారనే సంకేతాలను పంపే మరో విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పరిశోధన నౌక ముసుగులో గూఢచారి నౌక ‘జియాంగ్ యాంగ్ హాంగ్ 03’ చైనా నుంచి మాల్దీవుల రాజధాని మాలేకు బయలుదేరిందని శాటిలైట్ ఇమేజ్‌ల సమాచారాన్ని బట్టి వెల్లడైంది. ఆ నౌక ఫిబ్రవరి 8 నాటికి మాలేకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈమేరకు భారత జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. మంగళవారం ఉదయం సేకరించిన ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. చైనా నుంచి మాలేకు బయలుదేరిన గూఢచారి నౌక ప్రస్తుతం ఇండోనేషియా దీవులు జావా, సుమత్రా మధ్యనున్న సుండా జలసంధి వద్ద ఉన్నట్లు నిర్ధారణ అయింది. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ఇటీవల చైనాలో ఐదురోజులు పర్యటించి వచ్చిన వెంటనే గూఢచారి నౌక మాలే వైపుగా బయలుదేరడం మారుతున్న సమీకరణాలను అద్దంపడుతోంది. చైనా నుంచి మాలేకు చేరుకోగానే ముయిజ్జు మరో కీలకమైన ప్రకటన కూడా చేశారు. మార్చి15కల్లా భారత సైనికులు మాల్దీవుల నుంచి వెళ్లిపోవాలని అల్టిమేటం ఇచ్చారు. మాల్దీవుల్లో దాదాపు 100 మంది భారతీయ సైనికులు, కొన్ని సైనిక ఆస్తులు ఉన్నాయి.

Tags:    

Similar News