US Elections: రేపే అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ముఖ్యమైన ఈ విషయాలు తెలుసుకోండి
మార్చి నెలలో మొదలైన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ రేపు కీలక దశకు చేరనుంది. మంగళవారం (నవంబర్ 5) పోలింగ్ ముగియనుంది. మరుసటి రోజే అసోసియేటెడ్ ప్రెస్ వంటి మీడియా సంస్థలు గెలిచే అవకాశాలున్న అభ్యర్థిని తేలుస్తాయి.
దిశ, నేషనల్ బ్యూరో: అగ్రరాజ్యం అమెరికా(America)లో కొన్ని నెలలుగా ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్నది. అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్(Kamala Harris), మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కీలకమైన స్వింగ్ స్టేట్‌ల(Swing States)లో వీరి ప్రచారాలు ముమ్మరంగా సాగాయి. మార్చి నెలలో మొదలైన అమెరికా అధ్యక్ష ఎన్నికల(US Presidential Elections 2024) ప్రక్రియ రేపు కీలక దశకు చేరనుంది. మంగళవారం (నవంబర్ 5) పోలింగ్ ముగియనుంది. మరుసటి రోజే అసోసియేటెడ్ ప్రెస్ వంటి మీడియా సంస్థలు గెలిచే అవకాశాలున్న అభ్యర్థిని తేలుస్తాయి. సాధారణంగా పోలింగ్ జరిగిన మరుసటి రోజు గెలిచే అవకాశాలు కనిపించని అభ్యర్థి ఓటమిని అంగీకరిస్తారు. అధికారిక గెలుపు ప్రకటన వెలువడానికి సుమారు నెల రోజులు పడుతుంది.
మ్యాజిక్ ఫిగర్:
మన దేశంలో ఓటర్లు నేరుగా ఎంపీలను ఎన్నుకుంటే.. వారు ప్రధానిని ఎన్నుకుంటారు. కానీ, అమెరికాలో ఓటర్లు వేసే ఓట్ల ఆధారంగా ఎలక్టోరల్ ఓట్లు ఏ అభ్యర్థికి వస్తాయనేది డిసైడ్ అవుతుంది. ఉదాహరణకు టెక్సాస్ రాష్ట్రంలో 40 ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. ఇక్కడ మెజార్టీ ఓట్లు దక్కించుకున్న అభ్యర్థికి ఆ 40 ఓట్లు వెళ్లుతాయి. అమెరికాలోని 50 రాష్ట్రాల ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 538. కనీసం 270 ఎలక్టోరల్ ఓట్లు దక్కించుకుంటే అమెరికా అధ్యక్షుడిగా గెలుస్తారు.
స్వింగ్ స్టేట్లు ఎందుకు ముఖ్యం?
అమెరికాలో కొన్ని రాష్ట్రాలు డెమోక్రటిక్ పార్టీకి, మరికొన్ని రాష్ట్రాలు రిపబ్లికన్ పార్టీలకు తరుచూ ఆమోదాన్ని తెలుపుతాయి. వీటిని ఆ పార్టీలకు సేఫ్ స్టేట్స్‌గా పేర్కొంటారు. ఈ సేఫ్ స్టేట్స్‌లో మార్పు లేకుండా తీర్పు ఇస్తే డొనాల్డ్ ట్రంప్(219) కంటే కమలా హ్యారిస్(226)కు ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లు దక్కుతాయి. అసలు విషయం ఇక్కడే ఉంది. ఇప్పుడు మెజార్టీ మార్క్ కోసం ఇద్దరు అభ్యర్థులు మిగిలిన ఏడు రాష్ట్రాలైన స్వింగ్ స్టేట్స్ పై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ ఏడు రాష్ట్రాల్లో తీర్పు తరుచూ మారుతూ ఉంటుంది. 93 ఎలక్టోరల్ ఓట్లు ఉండే ఏడు స్వింగ్ స్టేట్లు పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, నార్త్ కరోలినా, జార్జియా, నెవాడా, అరిజోనా, మిషిగన్ రాష్ట్రాలు.
సర్వే అంచనాలు..
ఈ స్వింగ్ స్టేట్లలో న్యూయార్క్ టైమ్స్/సియానా కాలేజీ తమ చివరి పోల్ సర్వేను ఆదివారం వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం స్వింగ్ స్టేట్‌లలో ట్రంప్ పై హ్యారిస్ స్వల్ప ఆధిక్యత కనబరుస్తున్నారు. నెవాడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్‌లలో హ్యారిస్ స్వల్పంగా ముందంజలో ఉండగా.. అరిజోనాలో ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఇక మిషిగన్, జార్జియా, పెన్సిల్వేనియాలో ఇరువురి మధ్య నెక్ టు నెక్ ఫైట్ ఉన్నట్టు తేలింది.
ఎన్నికల ఎజెండా
అమెరికా ఎన్నికల్లో ప్రధానంగా ఐదు కీలక అంశాలుగా అబార్షన్, ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థ, వలసలు ఉన్నాయి. అబార్షన్ హక్కు తొలగించడంతో రిపబ్లికన్లపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ట్రంప్ ఈ ఎన్నికల్లో అబార్షన్ పై ఎక్కువ మాట్లాడటం లేదు. గత ఎన్నికల తర్వాత కాపిటల్‌పై ట్రంప్ మద్దతుదారుల దాడి.. ఆ దేశ ప్రజాస్వామ్యంపై చర్చను రాజేసింది. బైడెన్ హయాంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. వృద్ధి కనిపించినా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సవాలుగా మారాయి. ట్రంప్ సింపుల్‌గా దిగుమతి సుంకాలు విపరీతంగా పెంచుతానని స్పష్టం చేశారు. ఇది అమెరికా వాసులకు ఉపయోగపడగా.. ఇతర దేశాలకు ఇబ్బందికరం. ఇక వలసల విషయంలో ట్రంప్ తీరుపై విమర్శలున్నాయి. అమెరికా చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో అక్రమవలసదారులను వెనక్కి పంపిస్తానని ట్రంప్ చెప్పారు. హెచ్1బీ వీసా, గ్రీన్ కార్డుల జారీపైనా కుదింపు ఉండొచ్చు.
తెలుగువారి మాటేమిటీ?
చాలామంది తెలుగువారు అమెరికా ప్రభుత్వ హెచ్-1బీ వీసా విధానాల్లో మార్పులను కోరుకుంటున్నారు. హెచ్-1బీ వీసాల జారీని సులభతరం చేస్తే.. దాన్ని పొందే వ్యక్తి, అతడి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నేరుగా అమెరికాకు వెళ్లిపోవచ్చు. ఇంకా ఇతరత్రా అనుమతులు అవసరం ఉండవు. అమెరికాకు అక్రమంగా వలస వచ్చే వారికి తాత్కాలిక వర్క్ పర్మిట్‌ను మంజూరు చేసి ఆదుకోవాలని తెలుగువారు కోరుతున్నారు.