ఏ టెండర్ లోనైనా 1.5 శాతం వాటా.. ఝార్ఖండ్ మాజీ మంత్రిపై ఈడీ ఆరోపణలు
ఝార్ఖండ్ మాజీ మంత్రి అలంగీర్ ఆలం కేసులో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. ప్రభుత్వ టెండర్లలో భారీగా సొమ్ము వసూలు చేసేవాడని ఈడీ కోర్టుకు తెలిపింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఝార్ఖండ్ మాజీ మంత్రి అలంగీర్ ఆలం కేసులో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. ప్రభుత్వ టెండర్లలో భారీగా సొమ్ము వసూలు చేసేవాడని ఈడీ కోర్టుకు తెలిపింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన ఏ టెండర్ లోనైనా 1.5 శాతం వాటా తీసుకునేవారని స్పష్టం చేసింది.
ఆలంగీర్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ కుమార్ లాల్ పని మనిషి జహంగీర్ ఆలం అనే వ్యక్తి ఫ్లాట్ నుంచి రూ.32.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ పేర్కొంది. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ వసూలు చేసే వారని తెలిపింది. 2022 సెప్టెంబర్ లో ఓ ఇంజినీర్ నుంచి రూ.3 కోట్లు అందుకున్నట్లు పేర్కొంది.
లోక్ సభ ఎన్నికల వేళ ఝార్ఖండ్ రాజధాని రాంచీలో రూ.32 కోట్లు స్వాధీనం చేసుకుంది ఈడీ. గతేడాది ఫిబ్రవరిలో ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజినీర్ వీరేంద్ర కుమార్ రామ్‌ను ఈడీ అరెస్టు చేసింది. రూ.10 వేలు లంచం తీసుకున్నాడన్న ఆరోపణలపై నాడు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో విచారణ చేపట్టగా.. అలంగీర్ ఆలం బయటకొచ్చింది.