‘‘ఇద్దరికి మించి సంతానం ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలి’’
ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలని ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలని ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ అన్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్.. చైనాను అధిగమించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బారామతిలో జరిగిన ఓ కార్యక్రమంలో అజిత్ పవార్ మాట్లాడుతూ..జనాభా నియంత్రణ క్రమంలో ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలున్న వారికి ప్రభుత్వం తరఫున ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని అన్నారు.
ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నికల్లోనూ అటువంటి వారిని పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు ఎలాంటి రాయితీలు ఇవ్వకుంటే జనాభా పెరుగుదల విషయంలో మరింత అవగాహన, చైతన్యం వస్తాయని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన జనాభా 35 కోట్లుగా ఉండగా,ఇప్పుడు 142 కోట్లకు చేరుకుందన్నారు. ఇందుకు మనమంతా బాధ్యులమేనని వ్యాఖ్యానించారు. దేశ ప్రగతి కోసం ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మందిని కలిగి ఉండటం మానివేయాలని ప్రతి ఒక్కరినీ కోరారు.