Air services:సంచలన పరిణామం.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిలిచిపోయిన విమాన సేవలు
సాంకేతిక కారణాలతో అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా విమాన సేవలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.
దిశ, వెబ్ డెస్క్: సాంకేతిక కారణాలతో అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా విమాన సేవలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. దీంతో విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే పరిస్థితిపై విచారణ జరుపుతున్నట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ తెలిపింది. సాంకేతిక లోపం కారణంగా ఆన్ లైన్ సేవలు, టికెట్ బుకింగ్ లపై తీవ్ర ప్రభావం పడినట్లు తెలుస్తుంది. మరోపక్క జాతీయ మీడియాలో మాత్రం మైక్రోసాఫ్ట్ సాఫ్ట్ వేర్ హ్యాకింగ్ కు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ కావడంతో అంతర్జాతీయంగా మీడియా, టెలికాం, విమాన, బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం పడింది. అలాగే లండన్ స్టాక్ మార్కెట్లు సహా అనేక సేవలకు విఘాతం కలిగింది. ఆస్ట్రేలియా దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి సమస్యలే తలెత్తాయి. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.
మరోపక్క మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అంతరాయం కారణంగా ముంబైలోని చెక్-ఇన్ సేవలపై ప్రభావం చూపింది. ఇండిగో, అకాసా, స్పైస్‌జెట్ వంటి విమానయాన సంస్థలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాయి. గ్లోబల్ మైక్రోసాఫ్ట్ అంతరాయం కారణంగా ఇండిగో, అకాసాఎయిర్, స్పైస్‌జెట్ చెక్-ఇన్ సేవలు ప్రభావితమయ్యాయని, దేశవ్యాప్తంగా విమానాలపై ప్రభావం పడింది.