మరో వివాదంలో ఎయిర్ ఇండియా.. క్షమాపణలు చెప్పిన విమానయాన సంస్థ!
ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ మరోసారి వివాదంలో చిక్కుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ మరోసారి వివాదంలో చిక్కుకుంది. రెండురోజుల క్రితం విమానంలో ప్రయాణించిన ఫేమస్ చెఫ్ సంజీవ్ కపూర్‌కు అందించిన భోజనంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా, సోమవారం కూడా మరో ప్రయాణికుడు తనకు వడ్డించిన భోజనంలో పరిశుభ్రత లోపించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎయిర్ ఇండియా స్పందించింది.
ఆయనను క్షమాపణలు కోరింది. ఎయిరిండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో సోమవారం ముంబై నుంచి చెన్నై వెళ్తున్న మహావీర్ జైన్ అనే ప్రయాణికుడు తనకు వడ్డించిన భోజనంలో పురుగు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్ షేర్ చేశారు. భోజనం ఇంత అపరిశుభ్రంగా ఉంటుందా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఎయిర్‌ఇండియా స్పందించింది.
‘మా విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో మీకు ఎదురైన అనుభవం విన్నందుకు చింతిస్తున్నాం. ఇది వినడానికి బాగాలేదు. ప్రక్రియ ప్రతీ దశలోనే పరిశుభ్రతను నిర్ధారించడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. మీరు మీ ప్రయాణ తేదీ, సీట్ నంబర్‌తో పాటు విమాన వివరాలను అందించగలరా ? దీనిపై సమీక్ష జరిపి, చర్యలు తీసుకుంటాం’ అని ట్వీట్ చేసింది.
మరో వివాదంలో ఎయిర్ ఇండియా.. క్షమాపణలు చెప్పిన విమానయాన సంస్థ!కాగా, ఈ ఘటనకు ఒక రోజు ముందు కూడా ఎయిర్ ఇండియాపై ఫేమస్ చెఫ్ సంజీవ్ కపూర్ విరుచుకుపడ్డారు. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఆయనకు అల్పాహారంగా అందించిన భోజనానికి సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేశారు. అందులో కోల్డ్ చికెన్ టిక్కా, శాండ్‌విచ్, డెజర్ట్ ఉన్నాయి. ఈ వంటకాన్ని విమర్శిస్తూ ‘నిజంగా దీన్ని భారతీయులు అల్పాహారంగా తినాలా?’ అని ఆయన ప్రశ్నించారు. దీంతో, మరోసారి ఎయిర్ ఇండియా తీరు వివాదాస్పదమవుతుంది.