Karnataka elections 2023: అమిత్ షాపై ఖర్గే ఫైర్
త్వరలో జరగనున్న కర్ణాటక ఎన్నికలకు అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
దిశ, వెబ్ డెస్క్: త్వరలో జరగనున్న కర్ణాటక ఎన్నికలకు అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఒకిరిపైనొకరు దుమ్మెత్తి పోసుకుంటూ రాజకీయాన్ని వేడెక్కించారు నేతలు. ఈ క్రమంలోనే కర్ణాటకలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కర్ణాటకలో ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ చట్టవిరుద్ధంగా 4 శాతం రిజర్వేషన్లు కల్పించిందని ఆరోపించారు. కాగా అమిత్ షా వ్యాఖ్యలను ఏఐసీసీ అధ్యక్షడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. కర్ణాటక ముస్లింలకు చాలా కాలం కిందట 40 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని, అయినా ఈ విషయంలో సుప్రీంకోర్టుకు లేని అభ్యంతరం బీజేపీ నాయకులకు ఎందుకని ప్రశ్నించారు. పేదలు, మైనారిటీలకు ఇచ్చిన ప్రభుత్వ పథకాలను, అవకాశాలను బీజేపీ లాక్కుంటోందని ఫైర్ అయ్యారు.
ఓట్ల కోసం ప్రజలను విడగొడుతున్నారని ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐకమత్యంతో ఉన్నారన్న ఆయన.. టికెట్ల కేటాయింపు తర్వాత ఏ ఒక్క కాంగ్రెస్ నేత నుంచి అసంతృప్తి వ్యక్తం కాలేదని చెప్పారు. కానీ బీజేపీలో పెద్ద ఎత్తున అసంతృప్తి ఉందని, అందుకే వారి మధ్యలో గొడవలు అవుతున్నాయని చెప్పారు. ఇదంతా బీజేపీ నాయకులపై ప్రజలకు ఉన్న అసంతృప్తికి నిదర్శమని అన్నారు. బీజేపీ పాలనలో ఐదేళ్లుగా ప్రజలు చాలా బాధలు పడుతున్నారని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందన్న ఖర్గే.. బీజేపీ నాయకులు ఓపెన్ గా 40 శాతం కమీషన్ తీసుకుంటున్నారని చెప్పారు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ ను కోరుకుంటున్నారని తెలిపారు.