4 నెలల నిషేధం తర్వాత ఉల్లి ఎగుమతులకు కేంద్రం అనుమతి
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉల్లి రైతులకు ప్రధానంగా మహారాష్ట్ర రైతులకు ప్రయోజనం కలగనుంది.
దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న వేళ కేంద్రం ప్రభుత్వం ఉల్లి ఎగుమతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా మహారాష్ట్ర నుంచి ఆరు పొరుగు దేశాలకు 99,500 టన్నుల ఉల్లి ఎగుమతులకు అనుమతులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉల్లి రైతులకు ప్రధానంగా మహారాష్ట్ర రైతులకు ప్రయోజనం కలగనుంది. దీంతో పాటు మిడిల్ ఈస్ట్, మరికొన్ని ఐరోపా దేశాలలో ఎగుమతి మార్కెట్ల కోసం 2,000 టన్నుల తెల్ల ఉల్లి ఎగుమతులకు కూడా కేంద్రం అనుమతించింది. 2023, డిసెంబర్ 8న ప్రభుత్వం ఉల్లిపాయల ఎగుమతిని నిషేధించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, బహ్రెయిన్, మారిషస్, యూఏఈలకు ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. అధికారిక ప్రకటనలో, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆయా దేశాలకు ఉల్లిని ఎగుమతి చేసే ఏజెన్సీ నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్ లిమిటెడ్(ఎన్‌సీఈఎల్) దేశీయ ఉత్పత్తులను చర్చల ప్రాతిపదికన 100 శాతం ముందస్తు చెల్లింపు రేటుతో ఎల్1లో ఈ-ప్లాట్‌ఫామ్ నుంచి సేకరించి, సరఫరా చేసింది.