Afganisthan: పాక్ బార్డర్‌లో 15వేల మంది తాలిబన్లు.. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య ఉద్రిక్తత !
ఆప్గనిస్థాన్‌పై పాక్ వైమాణిక దాడులు చేయగా 46 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
దిశ, నేషనల్ బ్యూరో: ఆప్గనిస్థాన్ (Afganisthan)పై పాక్ వైమాణిక దాడులు చేయగా 46 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అనంతరం ఈ దాడికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబన్లు హెచ్చరించారు. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే పాక్ పై యుద్ధం చేయడానికి ఆ దేశ సరిహద్దులకు సమీపంలో 15వేల మంది తాలిబన్ల(Talibans)ను ఆప్గనిస్థాన్ ప్రభుత్వం మోహరించినట్టు పలు కథనాలు వెల్లడించాయి. వీరంతా కాబూల్ (Kabul), కాందహార్(Kandahar), హెరాత్(Herath) నుంచి పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌కు ఆనుకుని ఉన్న మీర్ అలీ సరిహద్దు వైపు కదులుతున్నట్టు సమాచారం. దీంతో దక్షిణాసియాలో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ఈ ఘర్షణ నూతన యుద్ధానికి దారి తీయొచ్చని పలువురు భావిస్తున్నారు. అయితే దీనిపై ఇరు దేశాల ప్రతినిధులెవరూ అధికారికంగా స్పందించలేదు.
పరిణామాలను పరిశీలిస్తున్న భారత్ !
పాక్, ఆఫ్గన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను భారత్ నిశితంగా పరిశీలిస్తు్న్నట్టు పలు కథనాలు వెల్లడించాయి. ఎందుకంటే రెండు దేశాల్లో ఘర్షణ జరిగితే ఇరు దేశాలతో భారత్ సరిహద్దును పంచుకుంటున్నందున శరణార్థుల సంక్షోభం, తీవ్రవాద పెరుగుదల వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తాలిబాన్లు ఇండియాతో సత్సంబంధాలు ఆశించే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.