‘‘ఆదిత్య ఎల్ 1’’.. ఆదిత్యుడి గుట్టును ఎలా విప్పుతుందో తెలుసా ?
దిశ, నేషనల్ బ్యూరో : గగనసీమను దాటి భారత్ మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో : గగనసీమను దాటి భారత్ మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంతకుముందు చంద్రయాన్-3.. తాజాగా శనివారం ఆదిత్య ఎల్-1 ప్రయోగాల్లో ఇస్రో గ్రాండ్ విక్టరీని అందుకుంది. సూర్యుడిపై పరిశోధనల కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 శాటిలైట్ ‘లాగ్రాంజియన్ పాయింట్ 1’ (ఎల్-1) అని పిలిచే తుది కక్ష్యలోకి ప్రవేశించింది. శనివారం 63 నిమిషాల 20 సెకన్లపాటు ప్రయాణించిన తర్వాత ఆదిత్య ఎల్1 స్పేస్‌క్రాఫ్ట్‌ను భూమి చుట్టూ 235*19500 కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి సాయంత్రం 4 గంటలకు విజయవంతంగా ఇస్రో శాస్త్రవేత్తలు చేర్చారు. ఇది భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ 1 చుట్టూ ఉండే హాలో కక్ష్యలో పరిభ్రమించనుంది. ఎల్-1 పాయింట్ అనేది భూమి, సూర్యుడి మధ్య గురుత్వాకర్షణ బలాలు సమతౌల్య స్థితికి చేరుకునే ప్రత్యేక ప్రాంతం. అందుకే అక్కడ ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని ఇస్రో మోహరించింది. అక్కడి నుంచి అది సూర్యుడిని పరిశీలించి భూమికి సమాచారాన్ని అందించనుంది. ఈ ఆదిత్య ఎల్ 1.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పంపిన తొలి అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీ ప్రయోగం కావడం గమనార్హం.
ఆదిత్య ఎల్-1 ఏం చేస్తుంది ?
ఎల్-1 పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలో ఆదిత్య ఎల్-1 చక్కర్లు కొడుతూ.. సూర్యుడిపై ఉండే వివిధ పొరలను నిశితంగా గమనిస్తుంది. సూర్యుడి పొరలలోని వేడిని, వాటిలో అంతర్గతంగా జరిగే మార్పులను అర్థం చేసుకోవడమే ఈ మిషన్ ముఖ్య లక్ష్యం.సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు తొలిసారిగా భారత్ గతేడాది సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టింది. 127 రోజుల పాటు దాదాపు 15 లక్షల కిలో మీటర్లు ప్రయాణం చేసిన ఆదిత్య ఎల్-1 శాటిలైట్ శనివారం విజయవంతంగా గమ్యస్థానానికి చేరుకుంది. ఆదిత్య ఎల్-1 శాటిలైట్ ఐదేళ్ల పాటు సేవలు అందించనుంది. ఆదిత్య ఎల్-1 ప్రయోగం సూపర్ సక్సెస్ కావడంతో ఇస్రోలో శాస్త్రవేత్తలు సంబురాలు చేసుకున్నారు.
ఇది అసాధారణ విజయం : ప్రధాని మోడీ
‘‘ఆదిత్య ఎల్-1 ప్రయోగం సక్సెస్ అయినందుకు ఇస్రోకు నా శుభాకాంక్షలు. ఈ విజయంతో భారత్ మరో అరుదైన రికార్డును నెలకొల్పింది. ఇది అసాధారణమైన విజయం. మన దేశం సైన్స్ యొక్క కొత్త సరిహద్దులను తాకుతోంది. ఈ విజయ పరంపరను ఇస్రో కొనసాగిస్తుందని ఆశిస్తున్నా’’ అని ప్రధాని మోడీ తెలిపారు.
ఆదిత్య-ఎల్1 తయారీ ఇలా..
ఆదిత్య L1 శాటిలైట్‌లో వాడిన ఏడు పేలోడ్‌లను దేశంలోని వివిధ ప్రయోగశాలల్లో స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేశారు. VELC అనే పేలోడ్‌ను బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌లో తయారు చేశారు. SUIT పేలోడ్‌ను పూణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రో ఫిజిక్స్ డెవలప్ చేసింది. ASPEX అనే పేలోడ్‌ను అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీలో రూపొందించారు. PAPA పేలోడ్‌ను తిరువనంతపురంలోని స్పేస్ ఫిజిక్స్ లాబొరేటరీ, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సంయుక్తంగా తయారు చేశాయి. SoLEXS, HEL1OS అనే పేలోడ్‌లను బెంగళూరులోని UR రావు శాటిలైట్ సెంటర్‌లో తయారు చేశారు. మాగ్నెటోమీటర్ పేలోడ్‌ను బెంగళూరులోని ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్ కోసం లాబొరేటరీలో డెవలప్ చేశారు.