మోడీ మళ్లీ ప్రధాని అయితే దేశంలో ఇక ఎన్నికలు ఉండవు.. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్

ఆప్ జాతీయ అధికార ప్రతినిధి, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-06-15 13:54 GMT

న్యూఢిల్లీ : ఆప్ జాతీయ అధికార ప్రతినిధి, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చి పోటీ చేయకుంటే.. ఆ తర్వాత దేశంలో ఎన్నికలు జరగకపోవచ్చని కామెంట్ చేశారు. "2024 ఎలక్షన్స్ లో నరేంద్ర మోడీ ఇంకోసారి ప్రధానిగా ఎన్నికైతే రాజ్యాంగాన్ని మార్చేసి.. బతికి ఉన్నంత కాలం తానే దేశానికి ‘రాజు’ అని ప్రకటించుకునే ఛాన్స్ ఉంది" అని సౌరభ్ వ్యాఖ్యానించారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఏకం కాకుండా విపక్ష పార్టీలను బీజేపీ నయానో భయానో లొంగదీసుకుంటోందని చెప్పారు. ప్రధాని మోడీ రాజు అయితే.. దేశ స్వాతంత్ర్య సాధన కోసం ఎంతోమంది యోధులు చేసిన త్యాగాల ఫలం భావితరాలకు అందకుండా పోతుందన్నారు.

‘‘ప్రత్యర్థి పార్టీల నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు నిర్వహించి వారిని కటకటాల వెనక్కి నెడుతున్న తీరును చూస్తుంటే.. 2024లో మోడీ మళ్లీ ప్రధాని అయితే రాజ్యాంగాన్ని మారుస్తారని అనిపిస్తోంది" అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి లీడర్ల కొరతతో పాటు ఐడియాల కొరత కూడా ఉందని.. అందుకే ఆప్ మేనిఫెస్టో నుంచి సంక్షేమ పథకాలను కాపీ కొడుతోందని ఆయన ఆరోపించారు. "రాజ్యాంగాన్ని మోడీ మార్చేస్తారంటూ సౌరభ్ భరద్వాజ్ చేసిన కామెంట్స్ అర్ధం లేనివి.. అవి అవాస్తవాలు" అని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా స్పష్టం చేశారు. "చిన్నపిల్లల తరహా ఆరోపణలు చేయడం ఆపేసి.. కేజ్రీవాల్ అవినీతిపరుడని ఆరోపించిన పార్టీలను(కాంగ్రెస్ ) కౌగిలించుకోవడానికి ఇప్పుడు ఆప్ ఎందుకు తహతహలాడుతుందో చెప్పాలి" అని భరద్వాజ్ ను ప్రశ్నించారు.

Tags:    

Similar News