కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసిన‌ ఆర్డినెన్స్‌‌పై సుప్రీంను ఆశ్ర‌యించిన ఆప్ స‌ర్కార్

ఢిల్లీలో బ్యూరోక్రాట్ల బ‌దిలీలు, పోస్టింగ్‌ల‌పై ప‌ట్టుబిగిస్తూ.. కేంద్ర ప్ర‌భుత్వం జారీచేసిన‌ ఆర్డినెన్స్‌ను ఆప్ స‌ర్కార్ శుక్ర‌వారం సుప్రీంకోర్టులో మరోసారి స‌వాల్ చేసింది.

Update: 2023-06-30 13:56 GMT

న్యూఢిల్లీ : ఢిల్లీలో బ్యూరోక్రాట్ల బ‌దిలీలు, పోస్టింగ్‌ల‌పై ప‌ట్టుబిగిస్తూ.. కేంద్ర ప్ర‌భుత్వం జారీచేసిన‌ ఆర్డినెన్స్‌ను ఆప్ స‌ర్కార్ శుక్ర‌వారం సుప్రీంకోర్టులో మరోసారి స‌వాల్ చేసింది. రాజ్యాంగ‌ విరుద్ధంగా, ఏక‌ప‌క్షంగా ఉన్న ఈ ఆర్డినెన్స్‌ను త‌క్ష‌ణ‌మే నిలిపివేయాల‌ని అర‌వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్ర‌భుత్వం కోరింది. ఢిల్లీ పరిధిలోని బ్యూరోక్రాట్లపై ప్రజలచే ఎన్నికైన తమ ప్ర‌భుత్వం నియంత్ర‌ణ‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేలా ఈ ఆర్డినెన్స్ ఉంద‌ని పేర్కొంది. కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసిన ఈ ఆర్డినెన్స్ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధ‌ర్మాస‌నం తీర్పుకు విరుద్ధంగా ఉంద‌ని ఢిల్లీ సర్కారు తెలిపింది.

ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించాల్సిన కార్యనిర్వాహక విధులను లెఫ్టినెంట్ గవర్నర్‌ ద్వారా కేంద్రం నియంత్రిస్తోందని ఆరోపించింది. మరోవైపు కేంద్ర ఆర్డినెన్స్ ప్ర‌తుల‌ను దహనం చేసే నిరసన కార్య‌క్ర‌మాన్ని జులై 3న ఢిల్లీలోని ఆప్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఇందులో సీఎం కేజ్రీవాల్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఇక జూన్ 5న మొత్తం 70 పార్లమెంటు స్థానాల పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. జూన్ 6 నుంచి 13 వరకు ఢిల్లీవ్యాప్తంగా ఆర్డినెన్స్ ప్ర‌తుల‌ను దహనం చేస్తారు. ఈ ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లును జులై 3వ వారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.


Similar News